ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఊహించ‌ని ట్విస్ట్ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే స‌మ్మెకు తెర‌దించుతూ....ఆర్టీసీ కార్మికుల‌కు వ‌రాలు కురిపిస్తూ..అదే స‌మ‌యంలో....ఆర్టీసీ చార్జీలు పెంచుతూ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంపై అన్ని వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుండ‌గా....అదే ఆర్టీసీ స‌మ్మె కార‌ణంగా....ప్ర‌భుత్వం మ‌రో ఇర‌కాటంలో ప‌డింది. ఆర్టీసీ సమ్మెను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కేసీఆర్ ప్ర‌భుత్వం శాశ్వ‌త ఉద్యోగులు కొలువుల‌కు రాని స‌మ‌యంలో...తాత్కాలిక కండ‌క్ట‌ర్లు, డ్రైవ‌ర్ల‌ను నియ‌మించి బ‌స్సులు న‌డిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ సిబ్బంది తాజాగా దిల్‌సుఖ్‌నగర్ డిపో వ‌ద్ద ఆందోళ‌న చేశారు. ఆర్టీసీ స‌మ్మె సందర్భంగా బస్సులు నడిపిన తమకు ఆర్టీసీ‌లో ఉద్యోగాలు కల్పించాలని తాత్కాలిక సిబ్బంది కోరారు.

 

ఆర్టీసీ సమ్మె సమయంలో ప్రభుత్వం పిలుపుమేరకు తాము ప్రైవేటు ఉద్యోగాలు వదులుకొని మరీ 55 రోజుల పాటు ఆర్టీసీ బస్సులు నడిపించామని ఆర్టీసీ తాత్కాలిక సిబ్బంది అన్నారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు తిరిగి ఉద్యోగాల్లో చేరడంతో తాము రోడ్డున పడ్డామని, ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఆర్టీసీలో అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా తాత్కాలిక సిబ్బంది మాట్లాడుతూ సమ్మె తర్వాత ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తాత్కాలిక సిబ్బందికి కూడా ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారని వారు గుర్తుచేశారు. ఆదివారం ఆర్టీసీ కార్మికులతో జరిపిన సమావేశంలో ఆ విషయాన్ని మరిచారని అన్నారు. ఆర్టీసీ స‌మ్మె స‌మ‌యంలో 45 రోజుల పాటు ఆర్టీసీ బస్సులు నడిపిన తమకు ఆర్టీసీ ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలని నినాదాలు చేశారు.

 

మ‌రోవైపు చార్జీల పెంపుపై విప‌క్షాలు ఘాటుగా స్పందిస్తున్నాయి. ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్యులపై భారం వేసిందని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. అప్పుల్లో ఉన్న ఏపీ ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదన్నారు. మిగులు రాష్ట్రం తెలంగాణలో మాత్రం ఛార్జీలు పెరిగాయని జగ్గారెడ్డి అన్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఛార్జీల తగ్గింపు కోసం సంతకాల సేకరణ చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ ఛార్జీలను తగ్గిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: