ఉల్లి ధరలు సెంచరీ కొడుతున్నాయి. కేజీ వంద రూపాయలు దాటుతోంది. ఈ రేటు ఎక్కడి వరకూ వెళ్తుందో తెలియదు. డబుల్ సెంచరీ కొట్టి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణలు. అయితే ఈ పెరిగిన ధరలు మాత్రం కొందరికి పండుగ వాతావరణం తీసుకొస్తున్నాయి. పది కాలాలు ఈ రేటు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు. వారు ఎవరో తెలుసా.. రైతులు.. ఉల్లి రైతులు. అవును మరి ఇన్నాళ్లూ ఉల్లి సాగు చేసినా గిట్టుబాటు కాని వారు.. ఈ ఏడాది కాస్త లాభాలు కళ్లు చూస్తామని చెబుతున్నారు.

 

కర్నూలు మార్కెట్ చరిత్రలో ఉల్లికి రికార్డు ధరలు పలికాయి. క్వింటాలు ఉల్లి 10 వేల రూపాయలు దాటింది. ఉల్లి ధరలు ఈ స్థాయిలో పెరగటం ఇదే తొలిసారి. గతంలో ఎన్నడూలేని విధంగా... కర్నూలు ఉల్లి మార్కెట్ లో రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ క్వింటాలకు 7,400 రూపాయల వరకు ధర పలికింది. ఆ తర్వాత క్రమంగా తగ్గి సరాసరిన 6 వేల రూపాయలకు చేరింది.

 

ఇప్పుడు మళ్లీ ధరలు పుంజుకుంటున్నాయి. ఇప్పుడు ఏకంగా ఒక్కసారిగా పది వేల రూపాయల మార్కు దాటింది. అంటే మార్కెట్ లోనే కేజీ వంద రూపాయలు. ఇక ఇది వినియోగదారుడి దగ్గరకు వచ్చేటప్పటికి 150 నుంచి 200 రూపాయల వరకూ పెరిగే ఛాన్సుంది. ఈ ఏడాది సీజన్ ఆరంభంలో వానలు లేక చాలా మంది రైతులు పంట వేయలేదు. ఆ తర్వాత కురిసిన భారీ వర్షాలకు వేసిన పంట కుళ్లిపోయింది. ఉల్లిని ఎక్కువగా పండించే మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి పంట పూర్తిగా తగ్గిపోయింది. అందుకే ఉల్లికి ఫుల్ డిమాండ్ వచ్చింది. తాజాగా పదివేలు పలకటంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: