దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంషాబాద్ పశు వైద్యురాలు దిశ హత్య కేసులో తెలంగాణ ప్రభుత్వం ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటోంది. స్వయంగా సీఎం కెసిఆర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒక పెళ్ళికి హాజరు అవ్వడానికి ఢిల్లీ వెళ్లిన సీఎం కెసిఆర్ పై జాతీయ మీడియా ప్రశ్నల వర్షం కురిపించగా కెసిఆర్ మాత్రం మౌనమే తన సమాధానం అన్నట్లు వెళ్లిపోయారు. ఇక ప్రజల సంగతి సరేసరి, నిందితులకు వెంటనే మరణ శిక్ష అమలు చేయాలని లేదంటే తమకు అప్పగించాల్సిందిగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

 

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. కేసులో నిందితులకు శిక్ష పడేందుకు ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని హై కోర్టు ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం తరుపున హై కోర్ట్‌కు లా సెక్రెటరీ సంతోష్ రెడ్డి లేఖ రాశారు. "అత్యంత దారుణానికి పాల్పడ్డ ఉన్మాదులను, జైల్లో పెట్టి నెలలు నెలలు మేపడం సరి కాదని, హైకోర్టు వెంటనే స్పందించి, ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఘటనకు పాల్పడిన నిందితులకు వెంటనే శిక్ష పడేలా" చూడాలని కోరింది.  

 

తెలంగాణ ప్రభుత్వ లేఖకు హై కోర్టు ఏమని స్పందిస్తుందో చూడాలి. న్యాయ నిపుణులు మాత్రం, హైకోర్టు ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి, నిందితులకు వెంటనే శిక్ష పడేలా చూస్తుందని చెప్తున్నారు. ఇక మృగాళ్లకు నేటితో కస్టడీ ముగియడంతో, రేపు ఉదయం షాద్ నగర్ కోర్టు లో హాజరు పరచాల్సి ఉంది. బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నిందితులను జైలు నుంచే కోర్టు కు హాజరు పరిచేలా చూస్తున్నారు అధికారులు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జైలు నుంచే నిందితులను కోర్టు లో హాజరు పరచనున్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు ఇప్పటికే కోర్టు కు తెలుపగా, కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: