ఆధ్యాత్మికత ముసుగులో అమ్మాయిల్ని లోబరుచుకుంటున్న నిత్యానంద.. ఏకంగా కొత్త దేశాన్నే ఏర్పాటు చేశాడు. ఈక్వెడార్ నుంచి ఓ ప్రైవేటు దీవిని కొనుగోలు చేసి.. దానికి కైలాస అని పేరు పెట్టాడు. ఐక్యరాజ్యసమితికి అప్లికేషన్ పెట్టామని, అక్కడ నుంచి గుర్తింపు వచ్చిన వెంటనే.. విప్లవాత్మక మార్పులు ఉంటాయని చెబుతున్నాడు నిత్యానంద. 

 

అత్యాచారం కేసులో చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్న స్వయం ప్రకటిత దేవుడు స్వామి నిత్యానంద.. తన కోసం, తన భక్తుల కోసం ఏకంగా ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ రాజు ఆయనే...మంత్రి ఆయనే. అన్నింటికీ మించి దేవుడు కూడా ఆయనే. కైలాస పేరుతో సొంతంగా ఒక ద్వీప దేశాన్నే సృష్టించుకున్న నిత్యానంద... తన దేశానికి రావాలంటూ భక్తులను ఆహ్వానిస్తున్నారు. దక్షిణ అమెరికాలో ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు సమీపంలో ఉండే ఒక ద్వీపాన్ని ఈక్వెడార్‌ నుంచి కొనుక్కున్న నిత్యానంద దానికి కైలాస అని పేరుపెట్టారు. ఈ దేశానికి సొంత రాజ్యాంగం, ప్రధానమంత్రి , మంత్రివర్గం...ఓ ప్రభుత్వానికి ఉండాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. తమ దేశానికి గుర్తింపు ఇవ్వాలంటూ ఐక్యరాజ్యసమితితో చర్చలు కూడా మొదలు పెట్టారు.

కైలాస.. రివైవింగ్‌ ద ఎన్‌లైటెన్డ్‌ సివిలైజేషన్‌.. ద గ్రేట్‌ హిందూ నేషన్‌ పేరుతో నిత్యానంద కొత్త దేశాన్ని ఏర్పాటు చేశాడు. కైలాస వాసులు కావాలనుకునే భక్తులు...భారీగా విరాళాలు సమర్పించి ఈ దేశంలో చేరిపోవచ్చు... డబ్బులిచ్చిన వారికి నిత్యానంద దేశానికి చెందిన పాస్‌పోర్టు కూడా ఇచ్చేస్తారు. అయితే పాస్‌పోర్టులో మాత్రం కొన్ని తేడాలు ఉంటాయి. స్థాయిని బట్టి కొందరికి బంగారం రంగులో ఉండే గోల్డెన్‌ పాస్‌పోర్టు, మరికొందరికి ఎర్ర రంగు అట్టతో ఉండే పాస్‌పోర్టు ఇస్తారట. ఈ పాస్‌పోర్టుతో 14 లోకాల్లోకి ప్రవేశం ఉచితమట. హిందువులై...హిందూయిజాన్ని ఆచరించలేకపోతున్న వారు తమ దేశస్తులే అని ప్రకటించారు స్వామి నిత్యానంద. 

 

అన్ని దేశాల్లో ఉన్నట్టే ఇక్కడ కేబినెట్ కూడా ఉంటుంది. మొత్తం పది ప్రభుత్వ విభాగాలు నిత్యానంద ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటాయి. కేవలం నిత్యానంద వ్యవహారాలు చూడటానికి ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. మంత్రివర్గంతో నిత్యానంద చర్చలు జరుపుతూ ఉంటారు. కైలాస దేశానికి 547 పేజీల రాజ్యాంగం కూడా  ఉంది.. తమిళం, హిందీ, సంస్కృత భాషల్లో దీన్ని అందుబాటులో ఉంచారు. కైలాస దేశానికి జాతీయ జంతువుగా నందిని ప్రకటించారు.... జాతీయ పక్షిగా శరభం , జాతీయ పుష్పంగా పద్మం, జాతీయ వృక్షంగా మర్రి చెట్టును ప్రకటించారు.

 

హిందూ మతాన్ని ఉద్దరించడానికే సొంత దేశాన్ని ఏర్పాటు చేశానని చెబుతున్న నిత్యానంద..భారత దేశం నుంచి తన ప్రాణానికి ముప్పు ఉందని ప్రచారం చేస్తున్నారు. మహిళలను లోబరచుకోవడం, అత్యాచారం లాంటి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటూ చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్న నిత్యానంద... హిందూమతానికి తనను తానే ప్రతినిధిగా ప్రకటించుకున్నారు. నిత్యానంద వలలో పడ్డ వేలాది మంది కైలాస దేశంలో సభ్యత్వం కూడా తీసుకుంటున్నారు. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: