జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వ్యూహాత్మకంగానే ముందుకు వెళుతున్నారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన ఏ మాత్రం తడబాటుకు గురి కాకుండా పాలనలో దూసుకుపోతూ ఆరు నెలలు పూర్తి చేసుకున్నారు. అయితే ముఖ్యంగా జగన్ తన ఆరు నెలల పాలన కాలంలో సంక్షేమ పథకాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆరు నెలల్లోనే తాను మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేసే దిశగా పయనించారు. ఇప్పటికే చాలా సంక్షేమ పథకాలని అమలు చేశారు.

 

అలాగే నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు కల్పించారు. ఈ విధంగా ఆరు నెలల్లో సంక్షేమ పథకాల విషయంలో జగన్ కు మంచి మార్కులే పడ్డాయి గానీ అభివృద్ధి విషయంలో మాత్రం అనుకున్నంత పేరు రాలేదు. కాకపోతే జగన్ కూడా ఈ ఆరు నెలల్లో అభివృద్ధిపై పెద్దగా ఫోకస్ పెట్టినట్లు కనపడలేదు. అయితే ఇప్పుడు ఆరు నెలలు పూర్తి కావడంతో జగన్ వ్యూహాత్మకంగా అభివృద్ధి వైపు వచ్చేశారు. ఇక వరుసగా అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమయ్యారు.

 

ఇందులో భాగంగా అనంతపురంలో ఉన్న కియా పరిశ్రమకు వెళ్లనున్న జగన్....విశాఖ మెట్రోపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తాజాగా విశాఖ మెట్రోపై సమీక్ష జరిపిన జగన్....విశాఖ మెట్రో గురించి కొన్ని ప్రతిపాదనలు చేశారు.  విశాఖలో 10 విడతల్లో 10 కారిడార్లలో మొత్తం 140.13 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే రాయలసీమ వాసుల చిరకాల కల కడప స్టీల్ ప్లాంటుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్లాంట్ నిర్మాణం కోసం 250 కోట్లు కేటాయించిన జగన్.... ఈనెల 26న ప్లాంటుకు శంఖుస్థాప‌న చేయనున్నారు.

 

అదేవిధంగా వాల్‌మార్ట్ ఇండియాకు చెందిన బెస్ట్ ప్రైస్ స్టోర్లు త్వరలో కర్నూలు, తిరుపతి నగరాల్లో  ప్రారంభం కానున్నాయి. వీటితో పాటు రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. ఈ విధంగా వరుసగా పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసి జగన్ ప్రతిపక్షాల నోరు మూయించాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ వాళ్ల‌కు విమ‌ర్శ‌లు చేసేందుకు ప‌నిలేన‌ట్ల‌వుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: