ప్రాంతాల‌కు అతీతంగా...దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు చట్టాలు సవరించాలంటూ ఓ వైపు కొందరు ఆందోళన చేస్తుంటే.. మరోవైపు మాత్రం కొందరు మృగాలు మహిళలపై తమ చర్యలతో పేట్రేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో హైద‌రాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచార ఘటనల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైళ్లలో పెప్పర్ స్ప్రే అనుమతిస్తూ మెట్రో నిర్ణయం తీసుకుంది. మెట్రో రైళ్లల్లో ప్రయాణించే మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రేను తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చిన‌ట్లు మెట్రో రైల్  ఎండీ ఎన్‌వీస్ రెడ్డి ప్ర‌క‌టించారు. 

 


మహిళలపై లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకు, వారి రక్షణ కోసం ఇక నుంచి పెప్పర్ స్ప్రేలను కూడా మెట్రో స్టేషన్‌లోకి అనుమతిస్తామని ప్రకటించింది. కాగా, సాధారణంగా రైళ్లలో చెకింగ్ పాయింట్ దగ్గర గతంలో వీటిని పక్కన పడేసేవారు, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సాధారణంగా మెట్రోలో టెక్నికల్ అంశాలు పరిశీలిస్తే ఎప్పుడూ పెప్పర్ స్ప్రే, నిప్పు వ్యాప్తి చేసే పదార్థాలను అనుమతించరు. పెప్పర్ స్ప్రేల వల్ల త్వరగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. దీన్ని ప్రమాదంగా భావించిన మెట్రో అధికారులు అలాంటివి మహిళల వద్ద గుర్తిస్తే ఇది వరకు వాటిని సీజ్ చేసేవారు. కానీ ఇక నుంచి మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చని ఆదేశాలు జారీ చేసింది. మెట్రోలో మహిళల రక్షణ కోసం ప్రతిక్షణం నిఘా ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతం అనంతరం.. మహిళా ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించడం ప‌ట్ల ప‌లువురు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. 

 

ఇదిలాఉండ‌గా, మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వాలని ఆదేశిస్తూ.. న‌గ‌రంలోని అన్ని మెట్రో స్టేషన్లకు సమాచారాన్ని పంపించినట్లు అధికారులు చెప్పారు. పెప్పర్ స్ప్రేను తీసుకెళ్లే మహిళా ప్రయాణికులను అడ్డుకోవద్దని మెట్రో స్టేషన్ల భద్రతా సిబ్బందికి సూచనలు పంపామని అన్నారు. ప్ర‌ధానంగా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగినులు విధి నిర్వహణలో భాగంగా రాత్రివేళల్లో రాకపోకలు సాగిస్తుంటారని, వారిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: