మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారు అంటూ గత నాలుగు నెలలుగా వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. సహజంగానే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండి దానిని ఎంజాయ్ చేయడం గంటాకు అలవాటే. గత 7 సంవత్సరాలుగా మంత్రిగా కొనసాగుతున్న గంటా ఆరు నెలలుగా ఎలాంటి మంత్రి పదవి లేకుండా ఉన్నారు. ఇక పార్టీ మార్పు వార్తలపై ఎట్టకేలకు మౌనం వీడారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేసిన ఆయన.. తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతోనే నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

 

ఇక విభజన జరిగాక సమర్థులైన నాయకులను డివిజ‌న్ అధ్యక్షులుగా నియమిస్తామని చెప్పారు. తాను పార్టీ మార‌డం లేద‌ని గంటా స్పష్టంగా క్లారిటీ ఇవ్వడంతో ఆయన పార్టీ మార్పు ప్రచారానికి తెర పడినట్లయింది. ఇదిలా ఉంటే గంటా టీడీపీలోనే కొనసాగాలని భావించడానికి కారణం ఉందని విశాఖ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. జిల్లా వైసీపీలో చక్రం తిప్పుతున్న మంత్రి ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రయత్నానికి బ్రేక్ పడిందట.

 

గ‌త ఎన్నిక‌ల్లో న‌గ‌రంలోని నాలుగు సీట్ల‌ను టీడీపీ గెలుచు కుంది. దీంతో గంటా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయ‌న్ను పార్టీలోకి చేర్చుకుంటే కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పార్టీకి ప్ల‌స్ అవుతుంద‌నే వైసీపీ పెద్ద‌ల్లో చాలా మంది భావించారు. అయితే గంటాకు రాజ‌కీయంగా శ‌త్రువుగా ఉన్న ఆ మంత్రి మాత్రం వైసీపీలోకి గంటా వస్తే పార్టీకి మంచికంటే చెడే ఎక్కువ జరుగుతుందని అధిష్టానం వద్ద గట్టిగా వాదించారట.

 

స‌దరు మంత్రి చెప్పిన విష‌యాల‌తో అధిష్టానం కూడా ఆలోచనలో పడి ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయిందట. వైసీపీ ఎంట్రీకి బ్రేక్ ప‌డ‌డం... మారిన రాజకీయ పరిస్థితులలో బీజేపీలో చేరాలని గంటా శ్రీనివాసరావు డిసైడ్‌ అయినట్టుగా కూడా ప్రచారం జరిగింది. ఇప్పటికే ఆయన జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి బీజేసీ నేతలతో మంతనాలు కూడా జరిపారని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌తో ఆయ‌న టీడీపీలో ఉండడం ఖ‌రారైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: