చిదంబరం అంటే కాంగ్రెస్ లో ఓ క్రేజ్. సీనియర్ రాజకీయ నాయకుడిగా.. కష్ట కాలంలో ట్రబుల్ షూటర్ గా ఆయనకు ఎంతో పేరు ఉండేది. కానీ.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్న మాట.. ఈయన విషయంలో నిజమైంది. కేంద్ర మంత్రిగా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన.. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈ ఏడాది ఆగస్టు 12న చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసింది. అంతకు ముందు ఆయన ఆస్తులపై దాడులు.. కుటుంబీకుల వ్యవహారాలపై దాడులు చేసీ చేసీ చివరికి జైలుపాలు చేసింది.

 

కేంద్ర మంత్రిగా రాజభోగాలు.. సకల మర్యాదలు అనుభవించిన వ్యక్తి.. జైలుపాలవడం అంటే మామూలు విషయం ఏమీ కాదుగా.. అయినా.. చిదంబరం మాత్రం సత్యమే గెలుస్తుంది.. న్యాయమే విజయం సాధిస్తుంది అంటూ.. అందరిలాగే మంచి వచనాలు పలికారు. జైలుకు వెళ్లారు. 106 రోజుల తర్వాత బెయిలుపై మళ్లీ బయటికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. జైలులో ఎలా ఉన్నారు.. జైలు జీవితాన్ని ఎలా గడిపారన్నది చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లూ తాను చెక్క బల్లపైనే నిద్రించానని.. మిగతా సమయాల్లో సాధారణ ఖైదీలాగే గడిపానని అన్నారు. ఈ కారణంగా తన ఆరోగ్యం మెరుగైందని.. బరువు తగ్గానని వివరించారు.

 

ఇదంతా విన్న కాంగ్రెస్ నేతలు మాత్రం తీవ్ర నిరాశకు లోనయ్యారట. ఎలాంటి వాడు.. ఎలా ఐపోయాడు పాపం.. అనుకుంటూ ఆవేదన చెందారట. బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు కావడం అంటే ఇదేనేమో అనుకుంటూ.. చిదంబరంపై జాలి చూపిస్తున్నారు. కేంద్ర హోం మంత్రిగా.. కేంద్ర ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన.. ఇలా చిప్పకూడు తినాల్సి వచ్చిందని.. ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ను ముందుకు తీసుకుపోయిన ఈ చిదంబరమేనా.. ఇప్పుడు ఇలా అయిపోయాడు.. అని అనుకుంటున్నారు. కుమారుడు కార్తీ చిదంబరం వ్యవహారం కారణంగానే.. ఆయన ఇలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: