తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య‌నేత ఒక‌రు ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుకు గుడ్ న్యూస్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న త‌రుణంలో... ఆయ‌న తీపిక‌బురు చెప్పారు. ఇంత‌కీ ఏం చెప్పారంటే...తాను తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. జంపింగ్‌ల‌తో తెలుగుదేశం పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న త‌రుణంలో... ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం. కరణం బలరాం పేస్‌బుక్‌ వేదికగా స్పందించి త‌న గురించి జ‌రుగుతున్న కామెంట్ల గురించి క్లారిటీ ఇచ్చారు. 

 

2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసినా ప్రకాశం జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. అద్దంకి నుండి గొట్టిపాటి రవికుమార్, చీరాల నుండి కరణం బలరామ్, పర్చూరు నుండి ఏలూరి సాంబశివరావు, కొండపి నుండి బాలవీరాంజనేయస్వామి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయితే, అధికార వైసీపీలో ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ మంత్రులు రంగంలోకి దిగారని, నేరుగా ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారని వారు పార్టీ మార‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. 

 

జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే చర్చలు జరుపుతున్నారని, వైసీపీలోకి రావాలంటూ ఎమ్మెల్యేలకు ప‌లు ఆఫ‌ర్లు ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రిగింది.  చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ తో కూడా వైసీపీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని టచ్ లో ఉన్నట్టు సమాచారం. సానుకూలంగా ఉన్న వారితో చర్చలు జరుపుతున్న అధికార పార్టీ మంత్రులు...పార్టీ మారేందుకు సుముఖంగా లేని వారిని ఇబ్బందులు పెట్టేందుకు కూడా వెనుకాడటం లేదని టీడీపీ నేత‌లు, సానుభూతి ప‌రులు కౌంట‌ర్లు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో తాజాగా క‌ర‌ణం బ‌ల‌రాం సోష‌ల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. బెదిరిస్తే పార్టీ మారడానికి తమకు రాళ్ల వ్యాపారం, ఇసుక వ్యాపారం లేదని ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. పార్టీ మారాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: