ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు . రెండురోజుల పాటు ఢిల్లీలోనే  పర్యటించనున్నారు. నిన్న  సాయంత్రం ఆరు గంటలకు సీఎం జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ రోజు  ఉదయం.. లేదా మధ్యాహ్న సమయంలో ప్రధాని మోదీని సీఎం జగన్ కలవనున్నట్లు సమాచారం. 


గత రెండు రోజులుగా ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తుండగా ఈ రోజు ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారైనట్లు తెలుస్తోంది. అందువల్లే సీఎం జగన్ హడావిడిగా ఢిల్లీకి బయల్లేదరి వెళ్లినట్లు  సమాచారం. గురువారం అనంతపురం జిల్లాలోని కియా కార్ల ఫ్యాక్టరీ ఓపెనింగ్ సెరిమనీ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి జగన్.. తిరిగి తాడేపల్లి చేరుకోవాల్సి ఉంది. అయితే ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారైన నేపథ్యంలో ఆయన అక్కడి నుంచే  నేరుగా ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. 
 

ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, వెనుకబడిన జిల్లాలకు నిధులు.. రామాయపట్నం పోర్టు.. కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు తదితర విషయాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసిన జగన్ సర్కార్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ విషయాన్ని ప్రధానికి విన్నవించిన సీఎం.. మరోసారి నిధుల విడుదలపై చర్చించే అవకాశం ఉంది. త్వరితగతిన నిధులు విడుదల చేసి పనులు వేగవంతంగా జరిగేందుకు సహకరించాలని.. అలాగే అమరావతి నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరించి..నిరాటంకంగా కొనసాగేందుకు సాయమందించాలని విజ్ఞ‌ప్తి చేసే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టిపీడిస్తున్న నిధుల సమస్యను కేంద్రానికి వివరించి వీలైనంత ఎక్కువ నిధులు తెచ్చుకోవాలని జగన్ సర్కార్ యోచిస్తోంది. 

అలాగే జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కడప స్టీల్ ప్లాంట్‌ నిర్మాణానికి ఈ నెల 23 లేదా 24వ తేదీన శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం కూడా కడప స్టీల్ ప్లాంట్‌ పట్ల సుముఖత వ్యక్తం చేసిందని.. ముడి ఇనుము నిక్షేపాలు కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు అధికార పార్టీ ఎంపీలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: