నమ్ముకున్న వాళ్ళ విషయంలో వైఎస్సార్ కుటుంబం ఎలా వ్యవహరిస్తుందనే విషయానికి తాజా ఉదాహరణ. మూడు దశాబ్దాలుగా వైఎస్సార్ కుటుంబాన్నే నమ్ముకున్న నారాయణరెడ్డి మృతి విషయంలో జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ చూస్తుంటేనే ఆ విషయం అర్ధమైపోతుంది. జగన్ కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న నారాయణరెడ్డి గురువారం హఠాత్తుగా మరణించారు.

 

పిఏ మరణ వార్తను ఢిల్లీలో ఉన్న జగన్ కు తన స్టాఫ్ చెప్పారు. విషయం తెలియగానే శుక్రవారం తన పర్యటనను కుదించుకుని ఢిల్లీ నుండి మధ్యాహ్నానానికి అనంతపురం చేరుకుంటున్నారు. ఢిల్లీ నుండి నేరుగా కడపకు చేరుకుని అక్కడి నుండి అనంతపురం జిల్లాలోని దిగువపల్లెకు చేరుకుంటారు. కుటుంబసభ్యులను పరామర్శించిన తర్వాత తిరిగి అమరావతిలోని తాడేపల్లికి చేరుకుంటారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నారాయణరెడ్డి రాజారెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు కూడా బాగా సన్నిహితుడే. దాంతో జగన్ సిఎం కాగానే నారాయణరెడ్డిని తన పిఏగా నియమించుకున్నారు. ఇక్కడ వైఎస్ కుటుంబం చూసింది ఒకటే లాయల్టీ. తమ కుటుంబానికి విధేయులుగా ఉన్నవారిని అక్కున చేర్చుకోవటం, అవసరానికి ఆదుకోవటంలో వైఎస్ కుటుంబంలో మొదటి నుండి మంచి ట్రాక్ రికార్డే ఉంది.

 

రాజకీయంగా 30 ఏళ్ళు కష్టపడిన వైఎస్సార్ సిఎం కాగానే ఎక్కడెక్కడి తన మద్దతుదారులను పిలిచి మరీ పదవుల్లో కూర్చోబెట్టారు. పదవులను కట్టబెట్టడంలో వైఎస్ చూసింది విధేయతే కానీ కులం కాదు మతం కాదు. అదే పద్దతిని జగన్ కూడా అనుసరిస్తున్నారనే చెప్పుకోవాలి.

 

గడచిన తొమ్మిదేళ్ళుగా తనతో పాటు కష్టాల్లో ఉన్న వారిని, జైల్లో ఉన్నవారిని, పాదయాత్రలో ఫాలో అయిన వాళ్ళని ఎవ్వరినీ సిఎం అయిన తర్వాత దూరంగా పెట్టలేదు.  మొన్నటి ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గంలో  పోటి చేసి ఓడిపోయిన మోపిదేవి వెంకటరమణను మంత్రిని చేశాడంటే జగన్ చూసింది కేవలం విధేయతే తప్ప మరోటి కాదు. ఆ పద్దతిలోనే నారాయణరెడ్డిని కూడా పిఏని చేసి దగ్గరే పెట్టుకున్నారు. తమ కుటుంబానికి 30 ఏళ్ళుగా  అంత విశ్వాసంగా ఉన్నారు కాబట్టే నారాయణరెడ్డి మృతికి జగన్ కదిలిపోయారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: