చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే ’అమరావతి నిర్మాణంలో తాను తప్పుచేశానని ఐదుకోట్లమంది ప్రజలు అభిప్రాయపడితే తాను క్షమాపణ చెప్పటానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ తాజాగా వ్యాఖ్యానించారు. విజయవాడలో అమరావతి అభివృద్ధిపై అఖిలపక్షం(?) సమావేశం సందర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేయటం విచిత్రంగానే ఉంది.

 

నువ్వు తప్పు చేశావని జనాలెవరూ ప్రతి విషయంలోను పాలకులకు చెప్పరు. అధికారంలో ఉన్న పార్టీపై తమ అభిప్రాయాలను ఎన్నికల రూపంలో చెబుతారంతే. ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాయి. అయితే ప్రతిపక్షాల అభిప్రాయాలకు పాలకపార్టీ ఏపాటి విలువిస్తుందో అందరికీ తెలిసిందే.

 

ఇక చంద్రబాబు వ్యాఖ్యలను గమనిస్తే ఐదేళ్ళ పాలనపై జనాలు మొన్నటి ఎన్నికల్లో స్పష్టమైన తీర్పే ఇచ్చారు. తెలుగుదేశంపార్టీకి అంతటి ఘోరమైన ఓటమి ఎదురైందంటే ప్రజాభిప్రాయం తన పాలనపై ఎంత వ్యతిరేకంగా ఉందో  చంద్రబాబుకు తప్ప మిగిలిన జనాలందరికీ బాగానే అర్ధమైపోయింది. పరిపాలనలో మిగిలిన విషయాలను పక్కన పెట్టేద్దాం.  

 

ప్రపంచస్ధాయి రాజధాని అన్నారు. గ్రాఫిక్స్ తో జనాలను మోసం చేయటానికి ప్రయత్నించారు. అద్భుతమైన రాజధాని నిర్మాణం పేరుతో ప్రపంచంలోని వివిధ దేశాల్లో చుట్టొచ్చారు. కన్సల్టెంట్ల ఫీజుల పేరుతో వందల కోట్ల రూపాయలను తగలేశారు. అదే సమయంలో రైతుల నుండి వేల ఎకరాలను తీసేసుకుని పంటలను వేయనియ్యలేదు, ఒక్క శాస్వత భవనమూ కట్టలేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే జనాలు టిడిపి మాడు పగలకొట్టారు.

 

అందుకనే రాజధాని ప్రాంతం నియోజకవర్గాలైన మంగళగిరి, తాడికొండలో టిడిపి చిత్తుగా ఓడిపోయింది. మంగళగిరిలో అయితే చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేషే స్వయంగా ఓడిపోయారు. రాష్ట్రంలో ఓడిపోవటం ఓ ఎత్తైతే మంగళగిరిలో ఓడిపోవటం మరోఎత్తు. ఇంత స్పష్టంగా జనాలు తమ తీర్పు చెప్పినా ఇంకా తాను తప్పు చేసినట్లు ఐదుకోట్లమంది జనాలు చెప్పాలని చంద్రబాబు అడగటంలో అర్ధమేలేదు. కాబట్టి ఇప్పటికైనా తప్పు చేసినట్లు ఒప్పుకుని క్షమాపణ చెబితే కాస్త హుందాగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: