గతంలో ఎప్పడూ లేనంతగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెచ్చిపోతున్నారు. అయినదానికి కానిదానికి జగన్నే టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. ఎన్నికల్లో 151 సీట్ల అఖండ మెజారిటితో గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్ ను పవన్ ఇంతలా టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి ? అన్న విషయంలోనే అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

నిజానికి వపన్ ను జగన్ ఏనాడూ ఓ రాజకీయనేతగానో లేకపోతే జనసేనను బలమైన రాజకీయ పార్టీగానో గుర్తించలేదు. ఎందుకంటే పవన్ స్టామినాపై జగన్ కు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకనే ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా తన టార్గెట్ మొత్తం చంద్రబాబునాయుడుపై పెట్టారేకానీ పవన్ మీద కాదు.

 

సరే ఎన్నికలైపోయాయి జగన్ అధికారంలోకి కూడా వచ్చారు. మరిపుడు పవన్ ఎందుకు రెచ్చిపోతున్నారు ? ఎందుకంటే ఈమధ్యనే ఢిల్లీకి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి పవన్ వైఖరిలో మార్పు వచ్చిందని అంటున్నారు. ఢిల్లీలో బిజెపి అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలుద్దామనే పవన్ ఢిల్లీకి వెళ్ళారు. అయితే అమిత్ ను కలవటం కుదరకపోవటంతో తిరిగి వచ్చేశారనే అందరూ అనుకున్నారు.

 

కానీ, ఢిల్లీలో ఓ రహస్య ప్రాంతంలో అమిత్-పవన్ భేటి జరిగిందట. అంటే మీడియాకు కూడా తెలీకుండా ఏ అర్ధరాత్రో ఇద్దరికీ కావాల్సిన వ్యక్తుల ఇంట్లో ఎక్కడో కలుసుంటారు. దాదాపు అర్ధగంటపాటు భేటి జరిగిందట. ఆ తర్వాతే పవన్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది.

 

మొదటిదేమో జగన్ ను టార్గెట్ చేయటం. రెండోది బిజెపికి అనుకూలంగా ప్రకటనలు చేయటం. రెండింటిని పవన్ ఒకేసారి చేస్తుండటంతో తొందరలోనే బిజెపిలో జనసేన విలీనం జరిగిపోతుందని అర్ధమైపోతోంది. అదే సమయంలో పవన్ ను ముందుపెట్టి బిజెపి, చంద్రబాబునాయుడు తెరవెనుక నుండి పోరాటం చేస్తున్నారనే ప్రచారం కూడా అందరు చూస్తున్నదే.  ఇందులో భాగంగానే  జగన్ పై పవన్ ఎటాక్ పెంచారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: