దిశ నిందితుల ఉదంతంలో సంచ‌ల‌నాల ప‌రంపర కొన‌సాగుతోంది. చటాన్‌పల్లి బైపాస్ వద్ద దిశను దహనం చేసిన ప్రాంతంలో క్రైమ్‌సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో నిందితులు పోలీసులపై దాడికి దిగడం, తుపాకులను గుంజుకొని కాల్పులు జరప‌డంతో...ఆత్మరక్షణకోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు నిందితులు హతమయ్యారని పోలీసులు ప్ర‌క‌టించారు. శుక్రవారం తెల్లవారుజాము 5.45 నుంచి 6.15 గంటల మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్టు తెలిపారు. ఆ సమయంలో నిందితుల చేతులకు బేడీలు లేవని, పోలీసుల వద్ద ఉన్న తుపాకులు కూడా అన్‌లాక్ చేసి ఉన్నాయని చెప్పారు.

 

 

గత నెల 27న శంషాబాద్ సమీపంలో లైంగికదాడి, హత్య కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకొని 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుని.. వారిని జక్లేర్‌కు చెందిన మహ్మద్ పాషా, గుడిగండ్లకు చెందిన చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌గా తేల్చారు. శుక్రవారం షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి వద్ద నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో జక్లేర్, గుడిగండ్ల గ్రామాల్లో నిశ్శబ్దం రాజ్యమేలింది.  అయితే, ఈ ఎన్‌కౌంట‌ర్‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.  కోర్టు పరిధిలో కేసు ఉండగా పోలీసులు కావాలనే తమ బిడ్డలను పొట్టన పెట్టుకున్నారని మృతుల కుటుంబాలు రోదించాయి.  ఆ నాలుగు ఇళ్ల‌లో విషాదం అలుముకుంది. బాధిత కుటుంబాలు మినహా మిగతావారు పెద్దగా స్పందించలేదు. హతుల గ్రామాల్లో స్థానికులు మౌనముద్ర వహించారు. జక్లేర్, గుడిగండ్ల గ్రామాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లుచేశారు. మహ్మద్ పాషా తండ్రి హుస్సేన్‌ను, చెన్నకేశవులు తండ్రి కుర్మప్పను, జొల్లు శివ తండ్రి రాజప్ప, జొల్లు నవీన్ తల్లి లక్ష్మిని వనపర్తి ఎస్పీ అపూర్వరావు నేతృత్వంలో చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్ స్థలికి తరలించారు.

 


మహబూబ్‌నగర్ దవాఖానలో భద్రతమధ్య మృతదేహాలకు రాత్రి 10 గంటల వరకు పోస్టుమార్టం నిర్వహించారు. కాల్పుల్లో 11 బుల్లెట్లు మృతుల శరీరాల్లోకి దూసుకెళ్లినట్టు సమాచారం.  రాత్రి 8 గంటలవరకు మృతదేహాలు వస్తాయ ని ఎదురుచూశారు. మహబూబ్‌నగర్ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం హైకోర్టు ఆదేశాలమేరకు మృ తదేహాలను మార్చురీలోనే ఉంచారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన చెన్నకేశవులు, శివ, నవీన్ అంత్యక్రియల కోసం తవ్వించిన స్థలం వివాదాస్పదమైంది. గ్రామానికి చెందిన వెంకటమ్మ పొలంలో ఖననానికి గుంతతీయడంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరోచోట ఏర్పాట్లుచేశారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: