దిశ  కేసులో నిందితులతో సీన్ రీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కోసం దిశ ఫోన్, వాచ్, పవర్‌బ్యాంక్ దాచిపెట్టిన స్థలంలోపాటు మరిన్ని ఆధారాలను చూపిస్తామంటూ చెప్పడంతో నిందితులను పదిమంది సాయుధ స్పెషల్ పార్టీ సిబ్బంది దిశను దహనంచేసిన ప్రాంతానికి తీసుకెళ్లగా...నిందితులు షార్ట్‌గన్స్ లాక్కుని కాల్పులకు పాల్పడ‌టం... పోలీసులు ఎదురుకాల్పులు...ఆ న‌లుగురు హ‌త‌మ‌వ‌డం..తెలిసిన సంగ‌తే. అయితే, ఈ ఘ‌ట‌న‌లో పోలీసుల ముందు కొత్త స‌వాల్ ఎదురైంది. ఈ ఘటనలో మొత్తం 24 రౌండ్ల కాల్పులు జరిగినట్టు వెల్లడించారు. ఘటనాస్థలంలో ఎనిమిది బుల్లెట్ సెల్స్ స్వాధీనంచేసుకున్నారు. మిగతా బుల్లెట్ల విష‌యంలో ఉత్కంఠ నెల‌కొంది.

 

 

మొత్తం 24 బుల్లెట్ల‌లో...8 తూటాల ఆచూకి ల‌భ్య‌మ‌వ‌గా...మిగ‌తా 16 బుల్లెట్లు ఎక్క‌డ అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. ఆ బుల్లెట్లు న‌లుగురు నిందితుల శరీరంలోకి, మరికొన్ని పొలాల్లోకి దూసుకెళ్లి ఉంటాయ‌నే అనుమానం పోలీసులు వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, ప్ర‌భుత్వం అందించిన బుల్లెట్లు కాబ‌ట్టి వీటికి త‌ప్ప‌నిస‌రిగా లెక్క చెప్పాల్సి ఉంటుంది. అయితే, మిగ‌తా బుల్లెట్ల వివ‌రాలు లేక‌పోవ‌డంతో పోలీసు వ‌ర్గాల్లో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని అంటున్నారు. ఇదిలాఉండ‌గా,  కాల్పుల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు సీపీ సజ్జనార్ వివరించారు. పూర్తి వివ‌రాలు మ‌రోమారు వెల్ల‌డిస్తామ‌న్నారు.

 

రాత్రి10 గంటల వరకు పోస్టుమార్టం నిర్వహించారు. కాల్పుల్లో 11 బుల్లెట్లు మృతుల శరీరాల్లోకి దూసుకెళ్లినట్టు సమాచారం. శవ పంచనామాలో ప్రధాన నిందితుడి ఆరిఫ్‌పాషాకు నాలుగు బుల్లెట్లు వీపు, ఛాతిలోకి దూసుకెళ్లగా, శివకు మూడు బుల్లెట్లు, నవీన్‌కుమార్‌కు మూడు బుల్లెట్లు తల, వెనుకభాగంలో దిగాయని, చెన్నకేశవులకు తల భాగంలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లినట్టు తెలిసింది. కాగా, దిశ కేసులో శుక్రవారం నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌తో దిశ నివాసం ఉండే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నక్షత్రకాలనీతోపాటు శంషాబాద్, శంషాబాద్ మండలంలో సంబురాలు మిన్నంటాయి. పటాకులు కాలుస్తూ.. మిఠాయిలు పంచుకున్నారు. పోలీసులపై పూలు చల్లారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: