దిశ హత్య కేసులో నిందితులను పోలీసులు నిన్న తెల్లవారుజామున అత్యంత నాటకీయ రీతిలో ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్ కౌంటర్ పై సర్వత్రా అనేకానేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి రెండు గంటలకు నిందితులను ఘటనాస్థలానికి తీసుకెళ్లిన వైనం మరియు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పోలీసు కాల్పులకు చనిపోయిన విధానం మానవ హక్కుల సంఘాలు మరియు నిందితుల కుటుంబ సభ్యులకు మింగుడుపడడం లేదు. అయితే ఇదే విషయమై విచారణ జరిపేందుకు హై కోర్టు ఒక కమిటీని నియమించింది.

 

సాయంత్రం 6 గంటలకు అందిన వినతిపత్రంపై న్యాయస్థానం అత్యవసరంగా స్పందించి... శవపరీక్ష వీడియో, ఫోరెన్సిక్ నివేదిక, శవాల పోస్టుమార్టం రిపోర్టు శనివారం సాయంత్రం లోగా మహబూబ్ నగర్ జిల్లా జడ్జికి ఇవ్వాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇందుకు కారణం ఎన్ కౌంటర్ చేయబడిన నలుగురు నిందితుల మృతదేహాలు పై ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం కావడమే. వారి నలుగురిని పథకం ప్రకారం ఎన్ కౌంటర్ పేరుతో పోలీసు వారు కాల్చి చంపారని పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు.

 

అంతేకాకుండా రేపిస్టుల మృతదేహాలను జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు పరిశీలించాల్సి ఉంది. అయితే నారాయణపేట జిల్లా గుడిగండ్ల కు చెందిన నిందితులు మహమ్మద్ ఆరిఫ్, నవీన్, శివ, చెన్నకేశవులు అంత్యక్రియలను స్వగ్రామంలో నిర్వహించేందుకు గాను పోలీసులు వ్యవసాయ పొలంలో గుంతలు తీయగా 9వ తేదీ వరకూ వీరి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం అయితే లేదు.

 

ఇక మానవ హక్కుల సంఘం వారు మరియు కమిటీ వారు, జిల్లా జడ్జి ఫోరెన్సిక్ రిపోర్టులను మరియు మృతదేహాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇది నిజంగా ఎన్ కౌంటరా లేదా పథకం ప్రకారం పోలీసులు చేసిన హత్యా అని ఒక నిర్థారణకు వస్తారు. అప్పటి దాకా అంతా అయోమయమే... సర్వత్రా ఉత్కంఠే.

మరింత సమాచారం తెలుసుకోండి: