ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో‌కు చెందిన అత్యాచార బాధితురాలు గత అర్ధరాత్రి కన్నుమూసింది. 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. గతేడాది డిసెంబరులో బాధితురాలు అత్యాచారానికి గురైంది. పెళ్లి పేరుతో ఆమెను నమ్మించిన నిందితుడు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు గత నెల 25న విడుదలయ్యాడు. అయితే గురువారం తెల్లవారుజామున ఆమె.. న్యాయవాదిని కలిసేందుకు వెళుతుండగా బెయిలుపై బయటికి వచ్చిన దుండగులు బాధితురాలిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. 

 

అయితే కాలిన గాయాలతో బాధితురాలు కేకలు వేసుకుంటూ కిలోమీటరు వరకు పరుగులు పెట్టింది. అనంతరం ఆమెను లక్నోలో ఓ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి ఆమె తుదిశ్వాస విడిచింది. అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న శివం త్రివేది, శుభం త్రివేదీ కూడా సజీవ దహనానికి యత్నించిన వారిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే మరణించే ముందు ఐసీయూ వార్డులో చివరిసారిగా తన సోదరుడితో మాట్లాడారు. ‘‘నాపై సామూహిక అత్యాచారం చేసి, నిప్పంటించిన నిందితులను విడిచి పెట్టవద్దు’’ అని ఉన్నావో బాధితురాలు తన సోదరుడిని కోరింది.  

 

కాగా, ల‌క్నోకు 63 కి.మీల‌ దూరంలో ఉన్నావ్ ప‌ట్ట‌ణం ఉంది. ఈ ప‌ట్ట‌ణంలో 31 ల‌క్ష‌ల మంది జ‌నాభా నివిసిస్తున్నారు. అయితే ఉన్నావ్‌లో గ‌త 11 నెల‌ల్లో 86 రేప్ కేసులు, 185 లైంగిక వేధింపుల కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఉన్నావ్ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబికుతున్నాయి.  నిందితులు కఠినంగా శిక్షించాలంటూ ప్రజలు తమ ఆందోళనలను ఉధృతం చేశారు. మరోవైపు మాజీ సీఎం అఖిలేష్ ఆధ్వర్యంలో సమాజ్‌వాది పార్టీ నేతలు అసెంబ్లీ ఎదుట ధర్నాకు దిగారు. 

 

నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.  ఉన్నావ్ ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు అఖిలేష్ యాదవ్ పిలుపునిచ్చారు. దీంతో ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా ఘటనపై విచారణ జరుపుతామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ప్రకటించారు. ఉన్నావ్ రేప్ కేసులో బాధితురాలు మృతి చెందడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: