మాజీ మంత్రి, వైసిపి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డికి పార్టీ తరపున సీరియస్ వార్నింగులు వచ్చాయి. జిల్లాలో చంద్రబాబునాయుడుకి సన్నిహితుడైన మాజీ ఎంఎల్ఏ బీద మస్తాన్ రావు వైసిపిలో చేరారు. టిడిపికి రాజీనామా చేసిన బీద జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి పేరెత్తకుండానే ఆనంకు గట్టి వార్నింగే ఇచ్చారు.

 

నెల్లూరు నగరం సకల మాఫియాలకు అడ్డగా మారిపోయిందంటూ ఆనం మీడియా సమావేశంలో  చేసిన ఆరోపణలు సంచలనంగా మారింది.  ఏ అధికారిని పార్టీ ప్రజాప్రతినిధులు పనిచేసుకోనీయటం లేదన్నారు. జిల్లాలో ఇప్పటికి నలుగురు ఎస్పీలు మారితే ఇక వ్యవస్ధలు సక్రమంగా ఎలా పని చేస్తాయంటూ ప్రశ్నించారు. సరే మనసులో కుళ్ళు పెట్టుకుని సొంతపార్టీపైనే ఆనం దుమ్మెత్తిపోశారు.

 

అసలు ఆనంకు మనసులో కుళ్ళెందుకంటే  తనకన్నా జూనియర్లయిన అనీల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని. మొన్నటి ఎన్నికల్లో  వెంకటగిరి నుండి తాను గెలవగానే తనకు మంత్రిపదవి ఖాయమని ఆనం అనుకున్నారు. కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి  మాత్రం మొదటి నుండి తనకు విధేయులుగా ఉన్న అనిల్, మేకపాటికే మంత్రిపదవులు ఇచ్చారు. అప్పటి నుండి ఆనంకు మండిపోతోంది. ఇదికాకుండా పార్టీ పరంగా ఆనంకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయట.

 

నిజానికి ఆనంకు వెంకటగిరిలో టికెట్ ఇవ్వటమే చాలా ఎక్కువ. అసలు పార్టీలోకి చేర్చుకో వద్దని పార్టీలోని నేతలందరూ చెబితే జగన్ ముందు వద్దన్నారు. కానీ ఆనం వివేకానందరెడ్డి మరణించటం, టిడిపిలో నుండి బయటకు వచ్చేయటం లాంటి పరిణామాలతో వైసిపి నేతల్లో రామనారాయణరెడ్డి అంటే సానుభూతి మొదలైంది. అందుకనే ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడే పోటి చేయాలనే షరతు మీదే పార్టీలోకి జగన్ తీసుకున్నారు.

 

అయితే వెంకటగిరిలో  ఎప్పుడైతే గెలిచారో వెంటనే ఆనంలో మంత్రిపదవిపై ఆశపుట్టింది. ఇవ్వకపోయేటప్పటికి అసంతృప్తి మొదలైంది. ఆనం మనస్తత్వం తెలుసు కాబట్టే అసలు పార్టీలోకి వద్దే వద్దన్నారు. ఆనంలోని అసతృప్తి మీడియా సమావేశంలో బయటకు వచ్చేసింది. దాంతో జగన్ బాగా సీరియస్ అయినట్లు సమాచారం. అందుకనే విజయసాయిరెడ్డి తో ఆనంకు వార్నింగ్ ఇప్పించారు. మరి ఆనంలో మార్పొస్తుందా ? చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: