దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్‌పై ఓ వైపు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మవుతుండ‌గా...మ‌రోవైపు ట్విస్టుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితులను చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. నిందితుల మృతదేహాలు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. దీంతో అక్కడ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే,ఈ ఎన్‌కౌంట‌ర్‌పై నిందితుల కుటుంబ స‌భ్యులు ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో....సుప్రీంకోర్టులో ఇవాళ పిటిషన్‌ దాఖల‌వ‌డం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ బృందం శంషాబాద్  చేరుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 


షాద్‌నగర్‌ చటాన్‌పల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో  సుప్రీంకోర్టు 2014 మార్గదర్శకాలను పాటించలేదని దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో ఇవాళ పిటిషన్‌ దాఖలైంది. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌డుచుకున్నార‌ని పిటిష‌న్లో పేర్కొన్నారు. న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్ ఈ పిటిష‌న్ దాఖలు చేసి పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌, దర్యాప్తు, చర్యలు తీసుకోవాలని కోరారు.

 

ఇదిలాఉండ‌గా, దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ను  నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్  సుమోటోగా స్వీక‌రించింది. ఈ మేర‌కు తెలంగాణ పోలీసులకు శుక్రవారం ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీచేసి దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలు ఆందజేయాలని పోలీసులను ఆదేశించింది. మ‌రోవైపు, ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం స్వ‌యంగా రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తోంది. ఢిల్లీ నుంచి నలుగురు సభ్యుల బృందం హైదరాబాద్ వచ్చింది. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పరిశీలించింది. అనంత‌రం శంషాబాద్ నుంచి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఆస్ప‌త్రికి ఈ బృందం వెళ్లింది. కాగా, దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ను  నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్  సుమోటోగా స్వీక‌రించ‌డం, సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైన నేప‌థ్యంలో...ఎన్‌కౌంట‌ర్‌పై ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకోనున్నాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలాఉండ‌గా, ఎన్‌కౌంటర్ ఘటనలో ఎస్సై వెంకటేశ్వర్లు(35), కానిస్టేబుల్ అరవింద్ గౌడ్(35)కు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే శుక్ర‌వారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ హైటెక్‌సిటీలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: