ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను  ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం నిర్ణయంతో కార్మికులందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. 

 

 

 

 అయితే తాజాగా ఆర్టీసీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పల్లె వెలుగు సిటీ సర్వీసులపై కిలోమీటర్కు 10 పైసలు పెంచాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ పై  ఇరవై పైసలు పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. అయితే రాష్ట్రంలో ఎప్పటినుంచి ఛార్జీల పెంపు చేపట్టాలనే దానిపై... త్వరలో ప్రకటన చేస్తామని వెల్లడించారు. ప్రతి ఏటా  ఏపీ ఆర్టీసీ లో 1200 కోట్ల నష్టం వాటిల్లుతున్న  నేపథ్యంలో... చార్జీల పెంపు లాంటి కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. 

 

 

 

 ఆర్టీసీ వల్ల ఎక్కువగా నష్టాలు వస్తుండడం వల్లే ఈ  నిర్ణయం తీసుకోక తప్పదని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా అటు తెలంగాణలో కూడా తాజాగా ఆర్టీసీలో టికెట్ చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఆర్టీసీ సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని... సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకుని ఆర్టీసీ సంస్థను కొనసాగించాలంటే చార్జీల పెంపు తప్పనిసరి అని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు అన్ని సర్వీసుల్లో ఒక కిలో మీటర్ కి 20 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే తెలంగాణ సర్కార్ పెంచిన ఛార్జీలు పై తెలంగాణ ప్రజలు మాత్రం పెదవి విరుస్తున్నారు. మరి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ఏపీ ప్రజలు  ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: