బ్యాంకు ఖాతాదారుల‌కు  రిజర్వు బ్యాంక్ గుడ్ న్యూస్ తెలిపింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 నుంచి రోజంతా నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్(నెఫ్ట్) లావాదేవీలు జరుపుకునే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయంతో రోజంతా, ముఖ్యంగా సెలవు రోజుల్లో కూడా నెఫ్ట్ ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు.  డిజిటల్ లావాదేవీలు జరిపే వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలనే ఉద్దేశంతో డిసెంబర్ 16 నుంచి 24X7 అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో నిధుల కొరత రానీయకూండా బ్యాంక్‌లు కీలక చర్యలు చేపట్టాలని, తద్వారా కస్టమర్లకు నిధుల కొరత నుంచి ఉపశమనం లభించనున్నదని పేర్కొంది. 

 

నెఫ్ట్ ద్వారా రూ.2 లక్షల వరకు పంపుకునే వీలుంటుంది. ప్రస్తుతం సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే పనిచేస్తున్నాయి. అలాగే మొదటి, మూడో శనివారాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పనిచేస్తున్నది. అక్టోబర్ 2018 నుంచి సెప్టెంబర్ 2019 వరకు దేశవ్యాప్తంగా జరిగిన నగదు రహిత రిటైల్ చెల్లింపుల్లో 96 శాతం డిజిటల్ పేమెంట్ ద్వారా జరిగాయి. ఇదే సమయంలో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్(నెఫ్ట్) ద్వారా 252 కోట్ల లావాదేవీలు జరుగగా, యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) ద్వారా 874 కోట్ల లావాదేవీలు జరిగాయి.

 

 

కాగా,  డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఇప్పటికే ఆర్టీజీఎస్ లావాదేవీలపై చార్జీలను ఎత్తివేసిన సెంట్రల్ బ్యాంక్..ఇటీవ‌లే నెఫ్ట్ లావాదేవీలపై కూడా చార్జీలను విరమించుకుంది. నెఫ్ట్ ద్వారా జరిపే లావాదేవీలపై చార్జిలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా ప్రకటించింది. ఈ చార్జీల ఎత్తివేత వ‌చ్చే ఏడాది 2020 నుంచి అమలులోకి రానుంది. ప్రస్తుతం పలు బ్యాంకులు ఒక్కో లావాదేవీపై రూపాయి నుంచి రూ.15 వరకు చార్జిని వసూలు చేస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో నెఫ్ట్ ద్వారా లావాదేవీలు జరిపేవారికి చార్జీల నుంచి ఊరట లభించినట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: