నెల్లూరు వైసీపీ రాజ‌కీయాల్లో పెను క‌ల‌క‌లం రేగింది. ఈ ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోకి వ‌చ్చిన రాజ‌కీయ సీనియ‌ర్ దిగ్గ‌జం, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి నెల్లూరు జిల్లా వైసీపీ కీల‌క నాయ‌కులు, జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులుగా ముద్ర ప‌డిన కోటం రెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నెల్లూరు న‌గ‌రాన్ని గ్యాంగ్‌స్ట‌ర్ల‌కు, మాఫియా లీడ‌ర్ల‌కు అప్ప‌గించేశార‌ని చెల‌రేగిపోయారు. దీంతో అధికారులు వారి వారి విధుల‌ను చేయ‌లేక చేతులు ఎత్తేస్తున్నార‌ని అన్నారు. 

 

ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆనంపై వేటు వేయాల‌ని ఇప్ప‌టికే పార్టీ అధినేత, సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, వివాద ర‌హితుడు, ఆది నుంచి కూడా సౌమ్యుడుగా పేరు తెచ్చుకున్న ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఇప్పుడు ఒక్క‌సారిగా ఇలా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం వెనుక ఏం జ‌రిగి ఉటుంది? అనేది రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. గ‌తంలో మంత్రిగా ప‌నిచే సిన స‌మ‌యంలోనూ ఆయ‌న ఎక్క‌డా నోరు జార‌లేదు. 

 

ఆ త‌ర్వాత టీడీపీలో ఉన్న‌ప్ప‌టికీ.. త‌న ప్రాధాన్యం లేద‌ని వాపోయారు త‌ప్పితే.. ఇలాంటి వ్యాఖ్య‌లు చేసింది కూడా లేదు. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారే త‌ప్ప వ్య‌క్తుల‌ను ఆయ‌న గ‌తంలోనూ టార్గెట్ చేయ‌లేదు. కానీ, ఇప్పుడు నెల్లూరు విద్యా సంస్థ‌ల విష‌యంలో త‌న కుటుంబాన్ని ప‌క్క‌న పెడుతున్నార‌నే అక్క‌సుతోనే ఇలా వ్య‌వ‌హ‌రించారా?  లేక త‌న‌కు మంత్రి ప‌ద‌విద‌క్క‌లేద‌నే బాధ‌తో ఇలా వైసీపీలో కీల‌క నేత‌ల‌పై వ్యాఖ్య‌లు చేశారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి.

 

ఇదిలావుంటే, ఆనం ఉద్దేశ పూర్వ‌కంగా పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయాల‌నే ఇలా వ్యాఖ్యానించార‌ని అంటున్నారు. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. ఆయ‌న ఓ పెద్ద‌ జాతీయ పార్టీలో చేరాల‌నే ఉత్సాహంతో ఉన్నార‌ని కొన్ని వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో త‌నంత‌ట త‌ను బ‌య‌ట‌కు రాకుండా పార్టీతోనే వేటు వేయించుకుని ముందుకు రావాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని, ఈ క్ర‌మంలోనే ఆయన ఇలా వ్య‌వ‌హ‌రించార‌ని నెల్లూరు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. 

 

మ‌రోప‌క్క‌, వైసీపీలో ఆనంను బ‌హిష్క‌రించాల‌నే డిమాండ్ అంత‌ర్గ‌తంగా వినిపిస్తోంది. ఆయ‌న వ‌ల్ల పార్టీకి ఏంటి ప్ర‌యోజ‌నం, పార్టీ వ‌ల్ల ఆయ‌న ఎమ్మెల్యే అయ్యారు. గ‌తంలో టీడీపీని న‌మ్ముకుని జ‌గ‌న్‌పై రాళ్లేసినా.. ఆయ‌న‌ను పార్టీలో చేర్చుకుని, టికెట్ ఇచ్చి గెల‌పించుకుంటే.. ఇప్పుడు పార్టీకే ద్రోహం చేసే ప‌రిస్థితికి చేరుకున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం నెల్లూరు విష‌యాల‌నై పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి సూక్ష్మ‌స్థాయిలో ప‌రిశీల‌న చేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: