కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన రాజకీయ నాటకంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అజిత్ పవార్.. ఎన్సీపీకి చెందిన ఈ నేత.. అనూహ్యంగా బీజేపీకి మద్దతు పలికి.. తెల్లారేసరికి మహారాష్ట్రకు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అజిత్ ఇచ్చిన షాక్ తో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఉక్కిరిబిక్కిరయ్యారు. అజిత్ పవార్ నిర్ణయంతో దేశమంతా ఒక్కసారిగా మహారాష్ట్ర వైపు చూసింది.

 

బీజేపీ నేత ఫడ్నవీస్ తో చేతులు కలిపి అర్థరాత్రి వేళ మంత్రాంగం జరిపి తెల్లారేసరికల్లా పదవిలో కూర్చున్నా.. ఆ తర్వాత మాత్రం కథ నడిపించలేకపోయారు. ఎన్సీపీ శాసనసభాపక్షనేత అయినప్పటికీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తన వెంట తెచ్చుకోలేకపోయారు. అంతే కాదు. శరద్ పవార్ ప్రయోగించిన ఫ్యామిలీ సెంటిమెంట్ కు లొంగకుండా ఉండ లేకపోయారు. చివరకు ఫడ్నవీస్ కు హ్యాండ్ ఇచ్చేసి మళ్లీ సొంత గూటికే చేరారు.

 

ఈ మొత్తం ఎపిసోడ్ ద్వారా మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ ఠాక్రే అయ్యేందుకు సహకరించిన అజిత్ పవార్ కు నజరానా దక్కింది. మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు ఆ రాష్ట్ర ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఏసీబీ నాగపూర్ హైకోర్టులో ఈ మేరకు ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. శివసేన నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి సరిగ్గా ఒక రోజు ముందు ఏసీపీ ఈ అఫిడవిట్ దాఖలు చేయడం విశేషం.

 

ఈ అఫిడవిట్ ప్రకారం... ఈ లొసుగులలో,లేదా కుంభకోణాలలో మంత్రిగా అజిత్ పవార్ ప్రమేయం లేదని తేల్చింది. అయితే ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలకు సంబంధించిన అధికారులు తప్పులు చేశారని తెలిపింది. అధికారుల తప్పులకు మంత్రిని బాధ్యుడిని చేయలేమని ఏసీబీ చెబుతోంది. అయితే .. ఇదే ఏసీబీ గతంలో డెబ్బై వేల కోట్ల మేర నీటిపారుదల రంగంలో కుంభకోణాలకు మంత్రిగా అజిత్ ను బాధ్యుడిని చేసింది. ఇప్పుడు అనుకూల సర్కారు ఉండటంతో కేసులు తేలిపోయాయి. క్లీన్ చిట్ వచ్చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: