"నెల్లూరు మాఫియాలకు అడ్డాగా మారింది. మాఫియాలు, కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువైపోయారు. లిక్కర్, బెట్టింగ్, లాండ్, శాండ్, ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు వస్తే దొరుతుకుంది. కొంతమంది మాఫియా గ్యాంగ్‌లు, గ్యాంగ్‌స్టర్‌లకు నెల్లూరును అప్పగించారు. ఈ విషయం బయటకు చెప్పుకోలేక ప్రజలు కుమిలిపోతున్నారు" ఈ ఘాటు వ్యాఖ్యలు చూస్తుంటే ప్రతిపక్ష పార్టీ అధికార పక్ష పార్టీపై చేసిన వ్యాఖ్యల్లాగా ఉన్నాయి కదా?, స్వయానా అధికార పార్టీకి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవేవో తన సన్నిహితుల దగ్గరో, అనుచరుల దగ్గరో చేస్తే మరోలా ఉండేది. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ వ్యాఖ్యలు చేయడంతో పార్టీలో కలకలం చెలరేగింది.

 

డిసెంబర్ 6న మీడియా సమావేశం ఏర్పాటు చేసి నెల్లూరు మాఫీయాకు అడ్డాగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్తా దుమారం రేపడంతో సీఎం జగన్ ఆనం కు గట్టి వార్నింగ్ ఇప్పించారు. పార్టీకి ఒక లైన్ అంటూ ఉంటుందని దాన్ని క్రాస్ చేస్తే ఊరుకోమంటూ ఎంపీ విజయసాయి రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. 

 

ఇక ఆనం వారి మాఫీయా కామెంట్స్ ఎవరిని ఉద్దేశించినవో అని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు. ఆనం ఫ్యామిలీకి నెల్లూరు ఒక పెట్టని కోట అప్పటి వైఎస్ హయాం నుంచి నేటి వరకు నెల్లూరు లో ఆధిపత్యం ఆనం వారిదే అయితే ఇప్పుడు మాత్రం ఆనం వారి ఆధిపత్యానికి బ్రేక్ పడింది. 

 

నెల్లూరు నుంచి గెలిచిన యువ ఎమ్యెల్యే అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. అత్యంత ప్రాధ్యానమున్న ఇరిగేషన్ శాఖను సీఎం జగన్ అనిల్ భుజాలపై పెట్టారు. ఇక అప్పటి నుంచి అనిల్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు, అనిల్ కు వెన్నుదన్నుగా నెల్లూరు జిల్లా కే చెందిన వైసీపీ ఎమ్యెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిలవడంతో ఆనం వారి ఆధిపత్యం జిల్లాలో తగ్గింది. తమ ఆధిపత్యం తగ్గడంతో ఆనం వారు బాగా భాధ పడినట్లు సమాచారం దీనితో నేరుగా విమర్శించకుండా మాఫీయా అని విమర్శించారని అని తెలుస్తోంది. 

 

ఆనం వారి విమర్శల అనంతరం అనిల్ దగ్గర ఒక రిపోర్టర్ ఆనం వారి విమర్శల గురించి ప్రస్తావించగా "నేను ఎందుకు అడగడం విమర్శ చేసిన ఆయన్నే అడగండి" అంటూ సమాధానమిచ్చారు. మరి వీరిద్దరి మధ్య సయోధ్య ఎలా కుదురుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: