ఏపీ శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి మొదలుకానున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన బడ్జెట్‌ సమావేశాలు హాట్‌ హాట్‌గా సాగిన విషయం తెలిసిందే. ఈసారి పరిస్థితి మరింత వాడి…వేడిగా ఉండే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా. పది రోజులపాటు సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో శాసన సభ సలహా మండలి (బీసీఏ) సమావేశం ఆదివారం సాయంత్రం నిర్వహించాలని నిర్ణయించినా అనివార్య కారణాల వల్ల సోమవారానికి దీన్ని వాయిదా వేశారు. తొలుత దిశ హత్యోదంతంపై చర్చ అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమవుతుంది. పలు కీలక అంశాలను చర్చకు ఉంచడంతోపాటు మూడు నుంచి ఐదు బిల్లులను సభ ఆమోదానికి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

 

అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి 21 అంశాలను తెలుగుదేశంపార్టీ ఎంపిక చేసుకుంది. బీసీలపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాలని నిర్ణయించారు. టీడీపీ ఎల్పీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు చేశారు. బీసీ మహిళలకు రూ.15 వేల ఆర్థికసాయం ఎందుకు ఇవ్వట్లేదని అడగాలని వారు బావించారు. ఉల్లి, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసులు, ఇసుక కొరతతో భవననిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, రైతు రుణమాఫీ 4, 5 విడతలు ఎగ్గొట్టడం, గ్రామ సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్ల నియామకాల్లో అక్రమాలు, మీడియాపై ఆంక్షల వంటి అంశాలపై చర్చకు ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఉల్లితో పాటు, నిత్యావసర ధరల పెరుగుదలపై సమావేశాల మొదటిరోజే వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. 

 

దేశవ్యాప్తంగా ఉన్న ఉల్లి ధరల సమస్య జగన్ ప్రభుత్వంపై ప్రభావం చూపుతుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో ఉల్లి ధరల తడాకా చూపుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఉల్లి ధరలు పెరిగి జనం అల్లాడుతుంటే.. నియంత్రించడం మాని దేశమంతా పెరిగాయని మంత్రులు చెప్పడం హాస్యాస్పదమని, ఉల్లి ఒక్కటే కాదు నిత్యావసరాలన్నీ చుక్కలనంటాయని ఆందోళనకు దిగేలా వ్యూహ రణ చేస్తున్నారు. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు. ఏమైందని నిలదీయడానికి సిద్ధం అయ్యారు.  

 

అసెంబ్లీ సమావేశాలలో తొలుత దిశ హత్యోదంతంపై చర్చ, అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమవుతుంది. పలు కీలక అంశాలను చర్చకు ఉంచడంతోపాటు మూడు నుంచి ఐదు బిల్లులను సభ ఆమోదానికి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పాఠశాల విద్యలో ఆంగ్ల మాధ్యమం, తెలుగు సబ్జెక్టు తప్పనిసరి చేయడం, ప్రభుత్వ పనుల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్‌, నామినేటెడ్‌ పదవులు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. పతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార పార్టీ సైతం సిద్ధమైంది. అన్ని శాఖల నుంచి సమగ్ర సమాచారంతో సభకు రానున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎలా ఉంది..? ప్రస్తుతం ఎలా ఎందో వివరించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నద్ధం అయ్యారు. టీడీపీ వేసే ప్రశ్నలతో వారినే ఇరుకున పెట్టేలా మంత్రులు వ్యూహ రచన చేశారు. ఏది ఏమైనా ఈ శీతాకాల సమావేశాలు రాష్ట్రంలో వేడిపుట్టిచ్చేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: