ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రజా ధనాన్ని పొదుపుగా ఖర్చు పెట్టటానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా వేల కోట్ల రూపాయలు ఆదా చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ తాడేపల్లిలోని ఇంటి నిర్మాణానికి, లోటస్ పాండ్ సెక్యూరిటీలకు సంబంధించిన జీవోలను రద్దు చేశారు.
 
సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా సందర్భాలలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయనని చెప్పిన విషయం తెలిసిందే. ప్రజాధనాన్ని సేవ్ చేస్తానని చెప్పిన సీఎం జగన్ తాడేపల్లిలోని ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ ఖజానా నుండి డబ్బును ఖర్చు పెట్టేలా జీవోలను జారీ చేయటంపై జాతీయ ఛానెళ్లు విమర్శించాయి. ప్రజాధనాన్ని సొంత అవసరాల కోసం సీఎం జగన్ దుబారా చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. 
 
దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించిన కేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ ఈ జీవోలను రద్దు చేశారని తెలుస్తోంది. సీఎం జగన్ నివాసం, క్యాంపు ఆఫీసుల్లో సదుపాయాల కోసం కేటాయించిన నిధులతో సకల వసతులతో కూడిన కొత్త భవనాన్ని నిర్మించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం కావడం, అప్పులు తెచ్చి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న పరిస్థితుల్లో కోట్ల రూపాయలు సీఎం జగన్ ఇంటికి ఎలా కేటాయిస్తున్నారన్న విమర్శలు రావడం కూడా జీవోల రద్దుకు కారణమని తెలుస్తోంది. 
 
జీవోలను రద్దు చేస్తూ వేరువేరుగా ఉత్తర్వులు వెలువడినప్పటికీ ఏ ఒక్క ఉత్తర్వులోను జీవోలు రద్దు చేయడానికి గల కారణాలను పేర్కొనలేదు. ఉన్నతాధికారులు కూడా జీవోల రద్దుకు కారణాలు తెలియవని చెప్పడం గమనార్హం. జీవోలను రద్దు చేయడంతో సీఎం జగన్ ప్రతిపక్షాల విమర్శలకు తాళం వేసినట్లే అని చెప్పవచ్చు. ఏది ఏమైనా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: