కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫ‌లితాలు అంద‌రూ ఊహించిన‌ట్లుగానే వెల్ల‌డ‌వుతున్నాయి. అధిక స్థానాల‌ను కైవ‌సం చేసుకునే దిశ‌గా బీజేపీ దూసుకెళ్తోంది. అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పర్వం సోమవారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. ఎమ్మెల్యేల రాజీనామా, అనర్హత వేటుతో 15 అసెంబ్లీ స్థానాల్లో ఈ నెల 5వతేదీన ఉప ఎన్నికలు జరిగాయి. 11 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉన్నట్లు ప్రాథమిక ఓట్ల లెక్కింపులో వెల్లడైంది. ఓట్ల లెక్కింపు స‌ర‌ళి ప్ర‌కారం అధికార బీజేపీ సభ్యులే అధిక స్థానాల్లో ముందంజలో ఉన్నారు.  

 

ప్రస్తుతం బీజేపీ 10 స్థానాల్లో ముందంజలో ఉండగా, జేడీఎస్‌, కాంగ్రెస్‌లు చెరో రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. హోస్కెట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇతర అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని యడియూరప్ప ప్రభుత్వం 105 మంది ఎమ్మెల్యేల బలంతో కొనసాగుతోంది. 15 అసెంబ్లీ స్థానాల్లో కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీ ద‌క్కించుకుంటే ప్ర‌భుత్వం కొన‌సాగ‌డానికి ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు.

 

ప్ర‌స్తుత ప‌రిస్థితి ఊపు చూస్తుంటే బీజేపీ ప్ర‌భుత్వానికి వ‌చ్చిన బెంగేమీ లేద‌ని ఆ పార్టీ శ్రేణులు మ‌నో నిబ్బ‌రంతో ఉన్నారు. 15 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల అనర్హత వేటుతో పోలింగ్ జరిగిన సంగతి విదితమే. మైనారిటీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న యడియూరప్ప తన ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు ఎక్కువ సీట్లు సాధించాల్సి ఉంది.  అయితే ఇప్ప‌టికే వెల్ల‌డైన  ఎగ్జిట్‌ పోల్స్ ప్ర‌కారం బీజేపీకే అధిక స్థానాలు వ‌స్తాయి. ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు బీజేపీలో ధైర్యాన్ని నింపాయి.  

 

ఎగ్జిట్‌పోల్స్ ఫ‌లితాలు తారుమారైన విష‌యాన్ని ప్ర‌తిప‌క్షాలు గుర్తు చేస్తున్నాయి. అయితే సోమ‌వారం ఫ‌లితాలు రౌండ్‌రౌండ్‌కు బీజేపీ ప్రాబ‌ల్యాన్ని వ్య‌క్తం చేస్తుండ‌టం ఎగ్జిట్‌పోల్స్ ఫ‌లితాల‌కు ప్ర‌తిరూపంగా ఉండేలా క‌న‌బ‌డుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు మొత్తం 15 స్థానాల్లో, జేడీఎస్‌ 12 స్థానాల్లో పోటీకి దిగాయి. మూడు పార్టీల మ‌నుగ‌డ‌కు ఈ ఫ‌లితాలు ఎంతో ముఖ్య‌మ‌ని చెప్పాలి. బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిస్తే ఆ పార్టీ ఇక క‌ర్ణాట‌క‌లో పాతుకుపోయిన‌ట్లేన‌ని భావింంచాల్సి వ‌స్తుంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: