ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. తెలంగాణాలో దిశ హత్యాచారం ఘటనపై మాట్లాడుతూ మహిళా భద్రతపై చర్చ చేపట్టారు. హోం మంత్రి మేకతోటి సుచరిత రెడ్డి మహిళా భద్రతపై మాట్లాడుతున్న సమయంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఉల్లి ధరలపై చర్చ జరపాలంటూ ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు. 

 

బిగ్గరగా అరుస్తూ ఉల్లి పై చర్చ జరగాలంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఉల్లిపై చర్చిద్దాం అని చెప్పారు. అయినా వినకుండా ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆందోళనలు విరమించలేదు. దీనితో జగన్ స్పందిస్తూ "మీ హయాంలో ఉల్లి రైతులు పంట దిగుబడి లేక ఉల్లి పంటను అక్కడే వదిలేసుకున్నారు. మీ హెరిటేజ్ లో ఉల్లి ని ఎంతకి అమ్ముతున్నారు, నేను చెప్పనా రూ 200 కు కేజీ ఉల్లిని మీ హెరిటేజ్ లో అమ్ముతున్నారు. మేము ఉల్లిని కేవలం రూ 25 కే సబ్సిడీ ప్రజలకు అందిస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడా ఉల్లి కొరత లేకుండా చేస్తున్నాం. " అని సీఎం జగన్ పేర్కొన్నారు.

 

ప్రతిపక్ష టీడీపీ నేతలు మాత్రం ఉల్లిపై చర్చ జరగాలంటూ పట్టుబట్టడంతో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి స్పందించారు. ఉల్లి ని స్పీకర్ కు గిఫ్ట్ గా ఇస్తాం అంటున్నారు ఈ ప్రతిపక్ష నేతలు ఇదెక్కడ పద్దతి అధ్యక్షా అంటూ టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. స్పీకర్ కూడా టీడీపీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 

 

సీఎం ఉల్లిపై చర్చిద్దాం అని పేర్కొన్న తరువాత కూడా టీడీపీ నేతలు అనవసరంగా ఆందోళన చేయడం సరికాదు అని చెప్పారు. సభలో భాద్యతాయుతంగా ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యమైన విషయం అయిన మహిళా భద్రత గురించి చర్చ జరుగుతుంటే అనవసరంగా ఆందోళన చేస్తున్నారని టీడీపీ నేతలపై మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: