జాతీయ పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఆగ్ర‌హ వ్యాఖ్య‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. . ఇవాళ లోక్‌స‌భ‌లో పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు చ‌ర్చ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షాపై ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. లోక్‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు క‌నీసం 0.001 శాతం కూడా మైనార్టీల‌కు వ్య‌తిరేకం కాద‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. బిల్లుపై ప్ర‌తిప‌క్షాలకు క‌లిగిన అన్ని సందేహాల‌ను తీరుస్తాన‌న్నారు. కానీ విప‌క్ష పార్టీలు స‌భ నుంచి వాకౌట్ చేయ‌రాద‌న్నారు. అయితే, హిట్ల‌ర్ త‌ర‌హాలో కేంద్ర మంత్రి షా కూడా చ‌రిత్ర‌లో నిలిచిపోతార‌ని ఓవైసీ కామెంట్ చేశారు. 

 

పౌర‌స‌త్వ బిల్లును వ్య‌తిరేకించిన ఓవైసీ.. భార‌త్‌లో సెక్యుల‌రిజం మౌళిక‌మైంద‌న్నారు. పౌర‌స‌త్వ బిల్లు ప్రాథ‌మిక హ‌క్కుల‌ను ఉల్లంఘిస్తోంద‌న్నారు. బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టి.. షా హిట్ల‌ర్‌గా మారార‌ని ఓవైసీ ఆరోపించారు. బిల్లు వ‌ల్ల భార‌త్.. ఇజ్రాయిల్‌గా మారుతుంద‌ని అస‌దుద్దీన్ విమ‌ర్శించారు.దీంతో బీజేపీ స‌భ్యులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆ స‌మ‌యంలో స్పీక‌ర్ ఆ వ్యాఖ్య‌ల‌ను రికార్డుల నుంచి తొల‌గిస్తున్న‌ట్లు చెప్పారు.

 

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు చ‌ర్చ సంద‌ర్భంగా మాట్లాడుతూ...భార‌తదేశాన్ని మ‌తం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభ‌జించింద‌ని తెలిపారు. మ‌తం ఆధారంగా దేశాన్ని కాంగ్రెస్ విభ‌జించ‌కుంటే.. ఇప్పుడు ఇలాంటి పౌర‌స‌త్వ బిల్లును తీసుకురావాల్సి వ‌చ్చేది కాద‌న్నారు. తాము రాజ్యాంగాన్ని ఉల్లంఘించ‌డం లేద‌న్నారు. ఇది మైనార్టీల‌కు వ్య‌తిరేకం కాద‌న్నారు. దేశ‌విభ‌జ‌న‌కు కాంగ్రెసే కార‌ణ‌మ‌న్నారు.1971 త‌ర్వాత బంగ్లాదేశ్ నుంచి వ‌చ్చిన వారికి మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ ఎలా పౌర‌స‌త్వాన్ని క‌ల్పించారో ఆయ‌న వివ‌రించారు. అప్ప‌ట్లో పాకిస్థాన్ వారికి ఎందుకు ఆ అర్హ‌త క‌ల్పించ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఉగాండా నుంచి వచ్చిన వారికి కూడా గ‌త ప్ర‌భుత్వాలు పౌర‌స‌త్వం క‌ల్పించాయ‌న్నారు. 

అయితే, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు ఆర్టిక‌ల్ 11, ఆర్టిక‌ల్ 14ల‌ను ఉల్లంఘిస్తోంద‌ని విప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. అయితే ఆ ఆరోప‌ణ‌ల‌ను షా కొట్టిపారేశారు. మ‌తం ఆధారంగా ప్ర‌భుత్వం చ‌ట్టాల‌ను చేసేందుకు ఆర్టిక‌ల్ 14 అడ్డుకోద‌ని షా అన్నారు. రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన‌ప్పుడు ఆర్టిక‌ల్ 14 గుర్తుకు రాలేదా అని ఆయ‌న విప‌క్షాల‌ను ప్ర‌శ్నించారు. పాకిస్థాన్‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌, బంగ్లాదేశ్ దేశాలు ఇస్లాం మ‌తాన్ని పాటిస్తున్నాయ‌ని, దేశ విభ‌జ‌న స‌మ‌యంలో భార‌త్‌, పాక్‌లు మైనార్టీ ర‌క్ష‌ణ కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్న‌ట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: