క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల ప‌రంప‌ర కొలిక్కి వ‌చ్చింద‌ని భావిస్తున్న త‌రుణంలో మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. కర్ణాట‌క‌లో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్‌ పార్టీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీజేపీ 12 స్థానాల్లో గెలిచింది. ఇవాళ వెలుబ‌డిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల్లో గెలిచిన‌వారిలో 11 మంది అన‌ర్హ‌త ఎమ్మెల్యేలే ఉన్నారు. కాగా,  జార్ఖండ్‌లోని హ‌జారిబాగ్‌లో జ‌రిగిన ఓ స‌భ‌లో ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ...క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెప్పార‌ని అన్నారు. ప్ర‌జాతీర్పును కాంగ్రెస్ పార్టీ అక్ర‌మంగా దోచేసింద‌ని, అందుకే ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌జ‌లు క‌ర్నాట‌క‌లో బీజేపీని గెలిపించార‌ని మోదీ అన్నారు. ఇదిలాఉండ‌గా, పార్టీ ఘోర ప‌రాభ‌వానికి బాధ్య‌త వ‌హిస్తూ మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధరామయ్య కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సీఎల్పీ ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చెప్పేశారు.

 


ఈ ఏడాది జూలైలో 17 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్, జేడీఎస్‌లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ వారిపై అనర్హత వేటు వేశారు. దీంతో కుమారస్వామి సారథ్యంలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ పతనమై.. యెడియూరప్ప ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5వ తేదీన ఉప ఎన్నికలు జరిగాయి. 15 అసెంబ్లీ స్థానాలకు గానూ భారతీయ జనతా పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 2, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు.కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎల్పీ పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని, అందుకే సీఎల్పీ పదవికి రాజీనామా చేశానని సిద్ధరామయ్య తెలిపారు. తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపానని ఆయన పేర్కొన్నారు. శాసనసభ ప్రతిపక్ష హోదా పదవికి కూడా రాజీనామా చేసినట్లు సిద్ధరామయ్య చెప్పారు. 

 

ఇదిలాఉండ‌గా, ఈ ఉప ఎన్నికల ఫలితాలను కలుపుతే శాసనసభలో బీజేపీ సంఖ్యా బలం 117కు చేరింది. కాంగ్రెస్‌ 68, జేడీ(ఎస్‌) 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం 112. అయితే బీజేపీకి 117 ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో సీఎం యెడియూరప్ప ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: