గత నెల 24న ముగ్గురు దుండగుల చేతిలో కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని లింగాపూర్‌ మండలం ఎల్లపటూర్‌ గ్రామానికి చెందిన దళిత మహిళ అత్యాచారం, హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే. హత్యకు గురైన ఆ మహిళ పేరు టేకులక్ష్మీ కాగా.. కలెక్టర్‌ కార్యాలయం ఆమె పేరును ‘సమత’గా మార్చింది. వారి కుటుంబ గౌరవ నిమిత్తం పేరు మార్చినట్లు కలెక్టర్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇదే స‌మ‌యంలో మృతురాలి ఇద్దరు పిల్లలను తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేర్పించి విద్య అందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. మృతురాలి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి ప్రతినెలా పెన్షన్‌, డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకుంటున్నారు. 

 


కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సూప‌రింటెండెంట్ ఎస్‌పీ కార్యాల‌యం విడుద‌ల చేసి ప‌త్రికా ప్ర‌క‌ట‌న ఇది
``లింగాపూర్‌ మండలం అత్యాచార బాధితురాలి పేరు సమత గా మార్పు- శీఘ్రగతిన పరిశోధన వారం రోజుల్లో చార్జిషీట్‌ - ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు- బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం.

తేదీ 24-11-2019 రోజు నాడు లింగాపూర్‌ మండల్‌, ఎల్లప్పటార్‌ గ్రామ శివారులో లో జరిగిన దళిత మహిళ మానభంగం మరియు హత్యకేసులో బాధితురాలు పేరును “సమత” గా మార్చడం జరిగింది. ఇక ముందు అన్ని మీడియా రిపోర్టులో బాధితురాలి పేరును సమత గా ఇవ్వగలరని మనవి. పై కేసులో కేసు నమోదు చేసినప్పుడు నుండి ఇప్పటివరకు వెంటవెంటనే పరిశోధనను శీఘ్రగతిన నిర్వహిస్తూ కేసుకు సంబంధించిన అన్నిరకాల సాక్ష్యాధారాలను సేకరించడం జరిగింది. ఇట్టి కేసుకు బాధ్యులైన ముగ్గురు నిందితులను వెంటనే అరెస్టు చేసి వారి వద్ద నుండి భౌతిక సాక్షాధారాలు సేకరించి వారికి మెడికల్‌ పరీక్షలు నిర్వహించి సంబంధిత ప్రభుత్వ వైద్యుల నుండి రిపోర్టు తీసుకోవడం జరిగింది. ఫోరెన్సిక్‌ సైన్స్‌ అధికారులకు కూడా ఇట్టి కేసులో పంపించిన భౌతిక సాక్ష్యాధారాల పరీక్షను శీఘ్రగతిన నిర్వహించి రిపోర్టు ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది. ఇట్టి రిపోర్టు
రెండు మూడు రోజుల్లో పరిశోధనాధికారికి వచ్చే అవకాశం ఉంది. ఇట్టి కేసును జిల్లా ఎస్పీ, కొమురం భీం ఆసిఫాబాద్‌ ఒక సవాలుగా తీసుకొని ఏరోజుకు ఆరోజు సేకరించవలసిన సాక్ష్యాధారాలను పర్యవేక్షిస్తూ కేసును పకడ్బందీగా తయారు చేయడం జరుగుతుంది. ఈ వారాంతానికి కోర్టు ముందర అన్ని ఆధారాలతో చార్జిషీట్‌ వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం వారికి ఈ కేసును శీఘ్రగతిన కోర్టు విచారణ జరపడానికి జిల్లా కలెక్టర్‌ ద్వారా ఒక నివేదిక పంపడం జరిగింది. ఇట్టి నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉంది, రెండు మూడు రోజుల్లో ఇట్టి విషయంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు గురించి ఆదేశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిందితులకు చట్ట పరిధిలో కఠినాతి కఠిన శిక్షలు పడే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇట్టి కేసులో ప్రభుత్వం నుండి రావలసిన ఆర్థిక సహాయాన్ని మృతురాలి యొక్క బంధువులకు వారం రోజుల్లో చెల్లించడం జరిగింది. అదేవిధంగా మృతురాలు ఇద్దరు పిల్లలను వారి కోరిక మేరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉచిత విద్యను అందించుటకు జిల్లా కలెక్టర్‌ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మృతురాలి కుటుంబానికి ఇంకా అందవలసిన ఆర్టిక
సహాయాన్ని చార్జిషీటు వేసిన మరుసటి దినమే అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము, మృతురాలి భర్త కు ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి ప్రతి నెలా పెన్షన్‌ మరియు డబుల్‌ బెడ్‌ రూమ్ ఇల్లు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్‌ గారు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇట్టి విషయమై ప్రజలకు మనవి చేయునది ఏమనగా నిందితులకు చట్ట పరిధిలో తక్షణమే కఠినమైన శిక్షలు విధించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కావున ప్రజలందరూ దయచేసి సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి,`` అని కోరారు. 


కాగా,  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆసిఫాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించి అత్యాచారం  హత్యకు గురైన దళిత మహిళ టేకు లక్ష్మి  ఘటన జరిగిన స్థలాన్ని సందర్శించిన కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఈ ప్ర‌క‌ట‌న విడుద‌ల కావ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: