కాంగ్రెస్ పార్టీ ఫైర్‌బ్రాండ్ నేత‌, మల్కాజిగిరి పార్లమెంట్ స‌భ్యుడు రేవంత్ రెడ్డి త‌న‌దైన శైలిలో మ‌రో వినూత్న కార్య‌క్ర‌మం చేశారు. మల్కాజిగిరి పార్లమెంటరీ కార్యాలయం పేరుతో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు mp రేవంత్ రెడ్డి కొత్త ఆఫీసు ప్రారంభించారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా అట్టహాసంగా ఈ కార్యాల‌యం ప్రారంభమైంది.అయితే, ఎంపీ రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటరీ కార్యాలయంను ప్రారంభించింది ఎవ‌రో తెలుసా? ఏ ప్ర‌ముఖుడో, పార్టీ ముఖ్య‌నేతో కాదు....కాంగ్రెస్ పార్టీ ఆఫీసు అటెండ‌ర్‌.

 


ఔను. రేవంత్ రెడ్డి కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించింది గాంధీభవన్ అటెండర్ షబ్బీర్. షబ్బీర్‌తో కార్యాలయం ప్రారంభించి, వినూత్న సంప్రదాయానికి ఎంపీ రేవంత్ రెడ్డి తెరతీశారు.షబ్బీర్ 40ఏళ్ళనుండి గాంధీభవన్ అటెండర్ గా పనిచేస్తున్నారు. కాగా, ఎంతోమంది కాంగ్రెస్ అగ్రనేతలైన పీసీసీ అధ్యక్షులకి, ముఖ్యమంత్రులకి, ఎంతోమంది మంత్రుల‌కు ఎమ్మెల్యేల‌కు అంకిత భావంతో సేవలందించిన త‌నకు రేవంత్ రెడ్డి కార్యాలయం ప్రారంభించే అవకాశం రావటం అదృష్టమని అటెండర్ షబ్బీర్ మురిసిపోయారు. సామాన్యుడైన షబ్బీర్ సేవలను గౌరవించిన ఎంపీ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు ప్రశంసించారు. 

 

కాగా, ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ నేతలు ఆర్సీ కుంతియా, జానారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనరసింహా, సుదర్శన్ రెడ్డి, హైదరాబాదు జిల్లా అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, సురేష్ షెట్కర్, మల్లు రవి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్, గంగారాం, విజయ రమణారావు, కొండావిశ్వేశ్వర్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్,బలరామ్ నాయక్ స‌హా ప‌లువురు ముఖ్య‌నేత‌లు హాజ‌రయ్యారు. కాగా, ఈ కార్యాలయం ద్వారా నన్ను గెలిపించిన మల్కాజిగిరి ప్రజల ఋణం తీర్చుకుంటూ, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకి సేవచేస్తాన‌ని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.త‌న కార్యాలయానికి వస్తే నమ్మకం దొరుకుతుందనే భరోసా ప్రజల్లో కలిగించేలా పనిచేస్తా అని రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: