త‌న‌దైన శైలిలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాల‌తో వార్త‌ల్లో నిలిచే మాజీ ఎంపీ, టీడీపీ నేత‌ జేసీ దివాకర్ రెడ్డి మ‌ళ్లీ అదే ర‌క‌మైన ప‌రిణామాల‌తో వార్త‌ల్లోకి ఎక్కారు. జేసీ బీజేపీ గూటికి చేరుతారని, ఆయనతోపాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని ప్ర‌చారం జోరుగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా.. ఎంపీ సుజనాచౌదరి నివాసానికి వెళ్లార‌ని, అక్కడ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి జేపీ నడ్డాతో భేటీ అయ్యార‌నే వార్త‌లు రాజకీయంగా సంచలనం రేపాయి. దాదాపు గంటపాటు నడ్డాతో.. జేసీ చర్చలు జరిపారని, ఈ సందర్భంగా జేసీని బీజేపీలోకి ఆహ్వానించార‌ని, అంతేకాకుండా, జేసీతో పాటు రాయలసీమకు చెందిన ఒకరిద్దరు నేతలను కూడా తనవెంట తీసుకు రావాలని నడ్డా కోరారని చ‌ర్చ జ‌రిగింది. అయితే, తాజాగా జేసీ కాంగ్రెస్ కార్యాల‌యంలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.

 

సుజ‌నా ఇంట్లో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో స‌మావేశ‌మైన జేసీ అనంతపురంలో తన బస్ ట్రావెల్స్‌పై జరుగుతున్న దాడులు, రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ కార్యకర్తలపై సాగుతున్న కక్షసాధింపులను కూడా ఏకరువు పెట్టుకున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. స‌హ‌జంగానే, జగన్‌ ప్రభుత్వం అసంబద్ధ నిర్ణయాలు, న్యాయపరమైన చిక్కుల పాల‌య్యేలా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని జేసీ దివాకర్‌రెడ్డి ప్రస్తావించారట‌. ఈ చ‌ర్చ ఇలా ఉంటే తాజాగా కాంగ్రెస్ నేత‌, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పార్టీ ఆఫీసులో జేసీ ప్ర‌త్య‌క్షం అయ్యారు.

 


కాంగ్రెస్ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియాగాంధీ జన్మదినం  సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటరీ కార్యాలయం అట్టహాసంగా ప్రారంభమైంది. సోమవారం ఉదయం కార్యకర్తల సంబురాల నడుమ గాంధీభవన్ అటెండర్ షబ్బీర్ చేత రిబ్బన్ కట్ చేసి రేవంత్ రెడ్డి త‌న కార్యాలయాన్ని  ప్రారంభించి...కొత్త ఒర‌వ‌డికి తెర‌లేపారు. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు విచ్చేశారు. అయితే ఇదే స‌మ‌యంలో...రేవంత్ కార్యాల‌యానికి జేసీ దివాక‌ర్ రెడ్డి వ‌చ్చారు. ఆయ‌న్ను ఆత్మీయ ఆలింగ‌నం చేసుకున్నారు. బీజేపీ వైపు గాలి మ‌ల్లిన జేసీ దివాక‌ర్ రెడ్డి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత ఆఫీసులో...అదికూడా ఆ ఆఫీసు ప్రారంభం రోజే ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: