ఆర్టీసీ సమ్మె తర్వాత.. కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన ఒక్కో హామీ నెరవేరుతోంది. ముందుగా.. సమ్మె కాలంలో ఉద్యోగుల జీతాలను విడుదల చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు  240 రోజులు తాత్కాలికంగా విధులు నిర్వహించిన  డ్రైవర్లు, కండక్టర్లను రెగ్యులరైజ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

 

ఆర్టీసీ పురోగతి, ఉద్యోగుల సంక్షేమంపై సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ శర్మ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. విధాన పరమైన నిర్ణయాల కార్యాచరణ అమలు తీరుతెన్నులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సంస్థ అభ్యున్నతి కోసం తీసుకోవల్సిన మరిన్ని చర్యల్ని ముఖ్యమంత్రి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు సూచించారు. క్షేత్ర స్థాయిలో డిపోలకు వెళ్లి అక్కడి ఉద్యోగులకు సంస్థ పట్ల మరింత నమ్మకం కల్గించేలా చూడాలని అధికారులకు ఆదేశించారు సీఎం. దీంతో పాటు ప్రధానంగా ఆక్యుఫెన్సీ రేషియోను 80 శాతంకు పైగా పెంచేందుకు తగిన కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసినట్లు అధికారులు తెలిపారు.

 

మరోవైపు 240 రోజులు తాత్కాలికంగా విధులు నిర్వహించిన 296 మంది డ్రైవర్లు, 63 మంది కండక్టర్లను రెగ్యులరైజ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సంస్థ. అటు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం, వారి సంక్షేమానికై తక్షణమే డిపోలలో వెల్‌ఫేర్‌ బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున కార్గో నిర్వహించడానికి త్వరితగతిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఈడీలకు ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతేకాకుండా సంస్థలో అధనపు ఖర్చుల్ని తగ్గించే ప్రయత్నం చేయాల్సి ఉందన్నారు. సమ్మె కారణంగా చనిపోయిన 38 మంది కార్మికుల్లో ఇప్పటికే 33 మంది కుటుంబ సభ్యులకు ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించారు. మరికొంతమందికి ఉద్యోగం ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తానికి ఆర్టీసీలో తాత్కాలిక డ్రైవర్లుగా.. కండక్టర్లుగా పనిచేసిన వారిని రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ వారు ముఖ్యమంత్రిపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: