అధికారం చేజారినా.. ప్రజలు ఓటుతో ఛీకొట్టినా తనలో ఎలాంటి మార్పులు రాలేదన్న విషయాన్ని తన చేతల్లో తరచూ చేసి చూపించే ఏపీ విపక్ష నేత చంద్రబాబు.. తాజాగా అదే విషయాన్ని మరోసారి తన చర్యల ద్వారా నిరూపించారని చెప్పాలి. విపక్ష నేతగా తాను వ్యవహరించాల్సిన హుందాతనాన్ని పాటించకుండా భద్రతా సిబ్బందితో ఆయన పెట్టుకుంటున్న పేచీలు చూస్తే.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని మాట్లాడే చంద్రబాబేనా? ఇలా మాట్లాడుతుందన్న సందేహం కలుగక మానదు.

 

ఈ రోజు (సోమవారం) ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం అవుతున్నాయో లేదో.. వెంటనే మైలేజీ కోసం బాబు అండ్ కో వేసే ఎత్తుగడులు చూస్తే నవ్వు రాక మానదు. ఎందుకంటే.. దేశం మొత్తంగా ఉల్లి ధరలు మండుతున్నాయి. పంట దెబ్బ తినటం.. విదేశాల నుంచి రావాల్సిన ఉల్లి రాకపోవటంతో అన్ని రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నాయి.

 

కేజీ ఉల్లి షాపుల్లో రూ.150 నుంచి రూ.200 వరకూ అమ్ముతున్న పరిస్థితి. అయితే.. సామాన్యలకు కష్టం కలగకుండా ఉండేందుకు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలో జగన్ ప్రభుత్వం ఉల్లి కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రాయితీ ధరకే ఒక్కొక్కరికి కేజీ చొప్పున ఉల్లిని అందిస్తోంది. పొరుగున ఉన్న తెలంగాణ కంటే ముందే ఏపీలో ఉల్లి కౌంటర్లను ఏర్పాటు చేసింది జగన్ సర్కారు.

 

అయినప్పటికీ లొల్లి చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మెడలో ఉల్లి దండను వేసుకొని అసెంబ్లీకి వెళ్లే ప్రయత్నం చేశారు. తమతో పాటు ప్లకార్డుల్ని పట్టుకొచ్చారు. సాధారణంగా సభలోకి ప్లకార్డుల్ని తీసుకెళ్లటానికి నిబంధనలు ఊరుకోవు. ఇదే విషయాన్ని చెబుతూ.. ప్లకార్డులు తమతో తెచ్చుకున్న బాబు అండ్ కోను అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద ఆపారు.

 

ఎవరైనా సరే రూల్ ప్రకారం వ్యవహరించాలన్న విషయాన్ని పక్కన పెట్టేసి.. రచ్చ చేయటం.. మీడియా కంట్లో పడాలన్న ఉద్దేశంతో బాబు వేస్తున్న ఎత్తుగడలు చూస్తున్న వారు మీరు మారరా బాబు? అనుకోకుండా ఉండలేని పరిస్థితి. అంటే సానుభూతి, మీడియా ప్రాప‌కం కోసం బాబు మ‌రోసారి డ్రామాలు ఆడి అడ్డంగా బుక్ అయ్యారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: