ఒకే తరహా అన్యాయాలకు సమాజంలో ఒకే తరహా న్యాయం జరగడం లేదు. దిశ అత్యాచారం, హత్య విషయం సమాజం, మీడియా, పోలీసులు, నాయకులు బ్రహ్మాండంగా స్పందించారు. ఆ ఒత్తిడికి తలొగ్గారో ఏమో కానీ.. పోలీసులు కూడా బుల్లెట్ తో దిశ పై జరిగిన అరాచకానికి తీర్పు చెప్పేశారు. కానీ అందులో కనీసం సగం వంతు స్పందన కూడా అంతకంటే దారుణం జరిగిన అన్యాయాలపై స్పందించడం లేదు.

 

ఉదాహరణకు.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో ఓ వివాహిత హత్యాచారం, హత్య కూడా దిశ ఘటనకు ఏమాత్రం తీసిపోవు.. కానీ ఈ అంశంపై ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనలో వివాహిత పేరును సమతగా మార్చారు. సమత పై హత్యాచారం జరిగిన లింగాపూర్ మండలం ఎల్లపటార్ అటవీ ప్రాంతాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ సభ్యుల బృందం పరిశీలించిoది.

 

 

పోలీసులు , స్థానికులతో మాట్లాడిన కాంగ్రెస్ నేతల బృందం ఆ తర్వాత నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సమత స్వస్థలం గోసంపల్లికి వెళ్ళింది. మృతురాలు కుటుంబ సభ్యులను పరామర్శించింది. వారి తర్వాత బీజేపీ నేతలు కూడా సమత కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యo అమ్మకాల కారణంగానే మహిళల పై అఘాయిత్యాలు జరుగుతున్నాయని బీజేపీ నేత అరుణ ఆరోపించారు.

 

ఈ నెల 12,13 తేదీల్లో రాష్ట్రంలో మధ్యపాన నిషేధం కోసం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద దీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్ష నేతల పర్యటన తో అధికార యంత్రాంగం ఫాస్ట్ కోర్టు కోసం ప్రభుత్వానికి నివేదించింది. మృతురాలి పేరు సమత గా ప్రకటించింది. మరి దిశ తరహాలో సమతకు న్యాయం జరుగుతుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి: