హాట్ టాపిక్‌గా మార‌డ‌మే కాకుండా హ‌ల్‌చ‌ల్ చేస్తున్న అంశంపై ఏపీ స‌ర్కారు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. మద్యం కొనేందుకు ఏపీలో మందుబాబుల కోసం వైఎస్ జగన్ సర్కారు లిక్కర్ కార్డులు ప్రవేశపెట్టనుందనే వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. రూ.5 వేలు డిపాజిట్ క‌ట్టి పొందే ఈ కార్డులో అమౌంట్ అయిపోతే బ్యాంకు అకౌంట్ నుంచి రీచార్జ్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తారని, మద్యం కొనాలంటే ఈ కార్డు ఉండాల్సిందే లేకుంటే వైన్ షాపు దరిదాపుల్లోకి కూడా రానివ్వర‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అయితే, దీనిపై స‌ర్కారు కీల‌క క్లారిటీ ఇచ్చింది. 

 

 

దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. ఈ క్ర‌మంలోనే...లిక్కర్ కార్డులు జారీ చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. మిడిల్ క్లాస్ ప్రజలు, కూలీలు, పేదలు ప్రతి రోజు వచ్చే కూలీ డబ్బుతోనే మద్యం కొంటుంటారు. లిక్కర్ కార్డులు జారీ అయితే జేబులో డబ్బుతో మద్యం కొనే పరిస్థితి ఉండదు. ఒక వేళ పక్కవారి కార్డు వాడేసి మందు కొందామనుకుంటే అది ఎంత మాత్రం కుదరదు. ఒక లిక్కర్ కార్డు ద్వారా ఎంత మద్యం కొంటున్నారు.. వారి ఆరోగ్య పరిస్థితి ఏంటీ.. డీ ఆడిక్షన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తికి లిక్కర్ కార్డు ద్వారా 3 బాటిళ్ల కంటే ఎక్కువ మద్యం అమ్మరు. ఒకే లిక్కర్ కార్డు నుంచి పరిమితికి మించి మద్యం కొంటే 3 నెలల్లో కార్డు రద్దు చేస్తారు. ఒక సారి కార్డు రద్దైతే ఎప్పటికీ కొత్త కార్డు జారీ చేయరు. రద్దైన లిక్కర్ కార్డులో డబ్బు ఉన్నా తిరిగి ఇవ్వరు. దీంతో పేదలు తాగుడుకు దూరం అవుతారని అధికారులు భావిస్తున్నారు అంటూ ప్ర‌చారం జ‌రిగింది.

 

అయితే, దీన్ని తాజాగా అధికారికంగా తోసిపుచ్చారు. రూ.5 వేల డిపాజిట్ కట్టి లిక్కర్ కార్డు కొంటేనే మందు అమ్మ‌కం అనే ప్ర‌తిపాద‌న ఏదీ లేద‌ని అధికారులు తెలిపారు. లిక్క‌ర్ కార్డుల‌పై అవాస్త‌వ ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని ఏపీ బేవ‌రేజెస్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ వాసుదేవ‌రెడ్డి ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వం లిక్క‌ర్ కార్డుల‌ను ప్ర‌వేశ‌పెడుతుంద‌నే ప్ర‌చారాన్ని ఆయ‌న ఖండించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: