ఏపీ అసెంబ్లీలో సోమవారం ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. మహిళల భద్రతపై చర్చ జరిగిన సమయంలో బాహుబలి సినిమాలో ఓ సీన్ ప్రస్తావనకు వచ్చింది. ఆ ప్రస్తావన తెచ్చింది సినీనటి అయిన నగరి ఎమ్మెల్యే రోజా. ఆమె ఏమన్నారంటే..” బాహుబలి సినిమాలో సేనాధిపతి భార్య భుజంపై మరో సేనాధిపతి చేయి వేసి వెకిలి చేష్టలు చేస్తే..హీరో కామాంధుడి తల తెగనరికాడు. ఆ రోజు థియేటర్‌లో చూశాను.. ఆడవాళ్ల కళ్లలో ఆనందం చూశాను.. అంటూ రోజా గుర్తు చేసుకున్నారు.

 

 

ఆమె ఇంకా ఏమన్నారంటే.. “ తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. ఈ రోజు దిశను హత్య చేసిన వారు ఎన్‌కౌంటర్‌ అయ్యారు. నిర్భయను హత్య చేసిన వాళ్లు జైల్‌లో ఉన్నారు. రిషితేశ్వరిని హత్య చేసిన వారికి ఇంతవరకు ఎలాంటి శిక్ష పడలేదు. అదే స్వప్నిక, ప్రణితలపై యాసిడ్‌ దాడి చేసిన వారిని దివంగత మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో శిక్షించారు. ఇవన్నీ కూడా మీడియాలో హైలెట్‌ అయ్యాయి. మీడియాకు దొరక్కుండా చనిపోయిన ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు... అన్నారు ఆర్కే రోజా.

 

 

" మీడియాలో కనిపించకపోతే మానం, ప్రాణం కాదా? ఆడపిల్లలకు కష్టం వస్తే.. గన్‌ వచ్చే లోపే సీఎం వైయస్‌ జగన్‌ వచ్చి శిక్షిస్తాడన్న ఒక నమ్మకం కావాలి. ఆడపిల్లలు కన్నీరు కార్చితే..ఆ కన్నీరు అవిరి అయిపోయే లోగా నిందితులకు శిక్ష విధిస్తారన్న నమ్మకం కలగాలి. నమ్మకాన్ని ఈ అసెంబ్లీ సాక్షిగా ఇవ్వాలి. మహిళలు బతికి బట్టకట్టాలంటే సత్వర న్యాయం కావాలి.

 

 

కోర్టులు, చట్టాలు ఉన్నాయని అందరూ అంటున్నారు. అవి వేగంగా పని చేయాలి. ఆడపిల్లలపై జరిగే అఘాయిత్యాలపై వెంటనే శిక్షించాలి. మహిళల భద్రత గురించి హోం మంత్రి మాట్లాడుతుంటే.. ఉల్లిపాయల గురించి మాట్లాడుతున్నారు. వీళ్లు మహిళలను చులకన చేసే విధంగా పరిపాలన చేశారు. అందుకే వీళ్లను ఆ మూలన కూర్చోబెట్టారు.. అంటూ మండిపడ్డారు రోజా.

మరింత సమాచారం తెలుసుకోండి: