పౌరసత్వ సవరణ బిల్లు 2019 పై నిన్న లోక్‌సభలో దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం అర్ధరాత్రి బిల్లు ఆమోదం పొందింది. చర్చ జరుగుతున్న సమయంలో విపక్షాలు ఈ బిల్లు ను వ్యతిరేకించాయి. ప్రతిపాదిత చట్టం ప్రకారం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ మరియు క్రైస్తవ వర్గాల వారు, డిసెంబర్ 31, 2014 వరకు ఎంతమంది అయితే భారత్ లోకి అక్రమంగా ప్రవేశించారో ఇప్పడు వారిని అక్రమ వలసదారులుగా పరిగణించకుండా భారతీయ పౌరసత్వం ఇస్తారు. బిల్లు మత ప్రాతిపదికన తయారు చేయడం రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు ఆందోళన చేసాయి. మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అమిత్ షా ను అడాల్ఫ్ హిట్లర్ గా సంబోధించారు. 

 

ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని బిల్లు పాస్ అయితే ముస్లింలకు నష్టం జరుగుతుందని ఓవైసీ ఆరోపించారు. మరోవైపు అమిత్ షా మాత్రం ఈ బిల్లు ముస్లింలకు ఏమాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. లోక్‌సభలో మొత్తం 391 ఓట్లకు గానూ ఈ బిల్లు కు అనుకూలంగా 311 మంది, వ్యతిరేకంగా 80 మంది ఓటు వేశారు. ఈశాన్య రాష్ట్రాలు ఈ బిల్లు పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ రాష్ట్రాలను ఈ బిల్లు నుంచి మినహాయించారు.

 

ఈ నేపథ్యంలో యునైటెడ్‌ స్టేట్స్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ రిలీజియస్‌ ఫ్రీడమ్‌(యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) పౌరసత్వ సవరణ బిల్లు పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ బిల్లును 'తప్పుడు దిశలో వెళుతున్న ప్రమాదకరమైన మలుపు’ గా పేర్కొంది యుఎస్ కమిషన్. "రెండు సభల్లో బిల్లు ఆమోదం పొందినట్లయితే హోంమంత్రి అమిత్‌ షా సహా, ఇతర కీలక నాయకత్వంపై ఆంక్షల్ని విధించే అంశాన్ని యూఎస్ ప్రభుత్వం పరిశీలిస్తుంది" అని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ సోమవారం (డిసెంబర్ 9) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 

 

లౌకికవాదం కలిగిన భారతదేశంలో ఇలాంటి మత ప్రాతిపదిక బిల్లు ను ఆమోదించడం పై ఆందోళన వ్యక్తం చేసింది యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: