అర్ణ‌బ్ గోస్వామి... సుప్ర‌సిద్ధ జ‌ర్న‌లిస్ట్‌. త‌న‌దైన శైలిలో పాత్రికేయ వృత్తిని నిర్వ‌హిస్తూ..వివాదాల‌ను టేక్ ఇట్ ఈజీగా తీసుకునే వ్య‌క్తి. త‌న వృత్తితో ఎంత పాపుల‌ర్ అయ్యారంటే..ఏకంగా 500 కోట్ల రూపాయ‌ల ప‌రువు న‌ష్టం దావా వేయించుకునే అంత‌. అలాంటి అర్ణ‌బ్ గోస్వామి దేశంలో అతిపెద్ద న్యూస్‌ చానల్స్‌ అసోసియేషన్‌ అయిన న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ ఫెడరేషన్‌ (ఎన్బీఎఫ్‌) అధ్యక్షుడిగా  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిపబ్లిక్‌ టీవీ చానల్‌ చీఫ్‌ ఎడిటర్‌గా ప్ర‌స్తుతం అర్ణబ్‌ గోస్వామి సేవ‌లు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

ఉపాధ్యక్షులుగా ఎన్నికైనవారిలో జేఎం పాండా (ఆర్టెల్‌ కమ్యూనికేషన్స్‌), శంకర్‌ బాలా (ఫోర్త్‌ డైమెన్షన్‌ మీడియా), సంజీవ్‌ నారియన్‌ (ప్రాగా న్యూస్‌), కార్తికేయ శర్మ (ఐటీవీ నెట్‌వర్క్‌) ఉన్నారు. వీరితోపాటు మాజీ పాత్రికేయుడు జై కృష్ణను సెక్రటరీ జనరల్‌గా ఎన్నుకున్నారు. భార‌త‌దేశంలోని వివిద చానళ్లలో ప్రసారంచేసే కార్యక్రమాల విషయంలో స్వీయ నియంత్రణకు సంబంధించిన విధివిధానాలు ఖరారుచేసేందుకు శనివారం సమావేశమైన అసోసియేషన్‌ గవర్నింగ్‌ బాడీని ఎన్నుకున్నది. ఎన్బీఎఫ్‌లో 25 రాష్ర్టాల్లోని 14 భాషలకు చెందిన 78 న్యూస్‌చానల్స్‌ ఉన్నాయి. 2020 చివరినాటికి ఈ స్వీయ నియంత్రణ సంస్థను అధికారికంగా ప్రకటించనున్నారు.ఎన్బీఎఫ్‌ వ్యవస్థాపకసభ్యులలో రిపబ్లిక్‌ టీవీ, టీవీ 9 భారత్‌వర్ష, న్యూస్‌లైవ్‌ అండ్‌ నార్త్‌ ఈస్ట్‌ లైవ్‌, పుథియథలైమురయ్‌, పాలిమర్‌ న్యూస్‌ (తమిళనాడు),వీ6 న్యూస్‌ (తెలంగాణ), సీవీఆర్‌ న్యూస్‌ (ఏపీ, తెలంగాణ) తదితర చానళ్లు ఉన్నాయి.

 

కాగా, గ‌తంలో టైమ్స్ నౌ యాంకర్, ఎడిటర్ ఇన్ చీఫ్ హోదాలో అర్ణ‌బ్ గోస్వామి ఉన్న స‌మ‌యంలో ఆయ‌న‌పై వివాదాస్పద ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్ రూ.500 కోట్ల పరువునష్టం దావా వేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనకు వ్యతిరేకంగా విద్వేష ప్రచారం చేశారని ఆరోపిస్తూ జకీర్ తరఫున లాయర్ గోస్వామికి నోటీసు పంపారు. న్యూస్ అవర్ డిబేట్‌లో గోస్వామి.. జకీర్ మత విశ్వాసాలను కించపరిచి, ఉద్దేశపూర్వకంగా ఆయనపై కుట్రచేశారని నోటీసులో ఆరోపించారు. ముంబై చీఫ్ బ్యూరో మేఘాప్రసాద్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవినాశ్‌కౌల్, టైమ్స్ గ్లోబల్ బ్రాడ్‌కాస్టింగ్ సీఈవో సునీల్‌లుల్లాకు కూడా నోటీసులు పంపారు. సుమారు పది మీడియా సంస్థలపై జకీర్ పరువునష్టం దావా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: