ఏపీలో విపక్ష టీడీపీ కి వరుసపెట్టి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి చేరుతున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలి నుంచి టిడిపి నాయకుడు, చంద్రబాబు బావమరిది సినీనటుడు నందమూరి బాలకృష్ణ కు మంచి ఆప్త‌మిత్రుడిగా పేరు తెచ్చుకున్నారు. బాబురావుకు మూడు సార్లు ఎమ్మెల్యే సీటు ఇప్పించడంలో బాల‌య్యే చక్రం తిప్పార‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.  2004లో దర్శి లో టిడిపి నుంచి పోటీ చేసిన బాబు రావు..  2014లో త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన‌ కనిగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

 

2009 ఎన్నిక‌ల్లో ఆయ‌న నామినేష‌న్ చివ‌ర్లో సాంకేతిక కార‌ణాల‌తో డిస్ క్వాలీఫై అయ్యింది. ఇక ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బాబురావు దర్శి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టిడిపికి గుడ్ బై చెప్పేసి బీజేపీ లేదా వైసీపీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ యేడాది ఎన్నిక‌ల్లో త‌న సిట్టింగ్ సీటు అయిన కనిగిరి కాకుండా తనకు ఇష్టం లేని పెళ్లి చేసినట్టు దర్శిని కట్టబెట్టడంతో అధినేత చంద్రబాబుపై బాబురావు గుర్రుగా ఉన్నారు.

 

ఇటీవల బాబురావు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తన కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు కీలక నేతలు భేటీ కావడంతో అక్కడికి వెళ్లారు. అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలంతా తమ రాజకీయ భవిష్యత్తుపై చర్చించుకున్నారు. టీడీపీలో ఉంటే త‌న‌కు భవిష్యత్తు లేదని... వైసీపీ లేదా ఇతర పార్టీల్లోకి వెళ్లాలనే అక్కడ కొందరు డిసైడ్ అయినట్టు సమాచారం. ఇక బాబురావు ప్రస్తుతం దర్శి ఇంఛార్జిగా ఉన్నారు. తన సొంత నియోజకవర్గమైన కనిగిరి లో మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ఉండగా తనకు రాజకీయ భవిష్యత్తు లేదని.... టిడిపి లో ఉంటే ఫ్యూచర్ లేనట్టే అన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

 

ఇక ద‌ర్శిలో మాజీ ఎమ్మెల్యే సిద్ధా రాఘ‌వ‌రావు ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నాలు చేయ‌డం కూడా క‌దిరికి టెన్ష‌న్ ప‌ట్టుకుందోట‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీ మార‌డ‌మే బెట‌ర్ అని డిసైడ్ అయ్యార‌ట‌. ఇక గ‌తంలో క‌దిరిపై ఇలాంటి వార్త‌లు వ‌చ్చిన‌ప్పుడు బాల‌య్య స్వ‌యంగా చెప్పి.. అలాంటి ఆలోచ‌న‌లు చేయ‌వ‌ద్ద‌ని కూడా చెప్పార‌ట‌. అయినా ఇప్పుడు క‌దిరి బాల‌య్య మాట కూడా వినే ప‌రిస్థితి లేదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: