కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీని.. ఆ పార్టీ అధినేత చంద్రబాబును, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను తీవ్రమైన పదజాలంతో విమర్శిస్తున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లోను టిడిపిని, చంద్ర‌బాబును టార్గెట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆయన అసెంబ్లీలో ఎలా వ్యవహరిస్తారో అన్న‌ ఆసక్తి అందరిలోనూ ఉంది. తాజాగా ఈ రోజు తనను స్వతంత్ర ఎమ్మెల్యే గా గుర్తించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరగా అందుకు ఆయన అంగీకరించారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అనుకున్నానని... అయితే గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి తో పాటు... నియోజకవర్గ ప్రజల కోసమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని చెప్పారు.

 

టీడీపీ తనను సస్పెండ్ చేసిందని.. గన్నవరం నియోజకవర్గ ప్రజల కోసం సభలో ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తాను టీడీపీలో కొనసాగలేని పరిస్థితి ఉందని.. తనకు ప్రత్యేకంగా సీటు కేటాయించాలన్నారు. ఇక తాను నిబంధ‌న‌ల ప్ర‌కారం నిర్ణ‌యం తీసుకుంటాన‌ని.. అసెంబ్లీలో ఎక్క‌డైనా కూర్చోవ‌చ్చ‌ని చెప్పారు. ఇక వంశీ టీడీపీ ఎమ్మెల్యేలు కూర్చొన్న ప్లేస్‌కు వెన‌క వైపున కూర్చొన్నారు.

 

ఇక వంశీ తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించమని కోరవడంతో కొత్త ట్విస్ట్ ఇచ్చినట్లయ్యింది. స్పీకర్ వంశీ నిర్ణయంపై కాస్త సానుకూలంగా స్పందించారు.. ఇక ఇప్పుడే జ‌గ‌న్.. బాబును టార్గెట్‌గా చేసుకుని కొత్త గేమ్ స్టార్ట్ చేసిన‌ట్ల‌య్యింది. ఇప్పుడు ఇదే నిబంధన ఆధారంగా చేసుకుని టీడీపీ నుంచి బయటకు వచ్చే మిగిలిన ఎమ్మెల్యేలు సైతం తమను కూడా ప్రత్యేక ఎమ్మెల్యేలుగా గుర్తించాలని స్పీకర్‌ను కోరితే అప్పుడు టిడిపి కి ప్రతిపక్ష హోదా కూడా కష్టమవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

ఇక ఈ రోజు వైసిపి ఎమ్మెల్యేలు సైతం టిడిపి కి ప్రత్యేక హోదా కూడా మిగ‌ల‌దని చెప్పారు. ఇక వంశీ కూడా తాను వైసీపీలో చేరతానని చెప్పలేదు. దీంతో ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని టిడిపి ఫిర్యాదు చేసినా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం లేదు. వంశీ కనుక వైసీపీ కండువా కప్పుకో వలసి వస్తే నే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయ‌న్ను స్పీక‌ర్‌ ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తే మిగిలిన టిడిపి ఎమ్మెల్యేలు కూడా గోడ దూకే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చలు నడుస్తున్నాయి. అప్పుడు బాబుకు ప్ర‌తిప‌క్ష నేత హోదా కూడా ఊడిపోతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: