వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు గత కొన్ని రోజుల నుండి దర్యాప్తును వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. రేపు సిట్ విచారణకు ఆదినారాయణ రెడ్డి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. గతంలోనే సిట్ విచారణకు హాజరు కావాలని ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేసినా స్పందించకపోవటంతో సిట్ సీఆర్పీసీ 160 కింద ఆదేశాలు జారీ చేసింది. 
 
సిట్ విచారణకు హాజరు కావడానికి ఆది న్యాయసలహా తీసుకున్నాడని తెలుస్తోంది. ఆదినారాయణ రెడ్డి ఇన్నిరోజులు అరెస్ట్ చేస్తారనే భయంతోనే విచారణకు హాజరు కాలేదని తెలుస్తోంది. సిట్ వైయస్ భాస్కర్ రెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డిలతో పాటు మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిలను విచారించింది. 2019 మార్చి 15వ తేదీన వివేకానందరెడ్డి తన ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. 
 
ఈ మధ్య కాలంలో ప్రభుత్వంపై వివేకా హత్య విషయంలో విపక్షాల నుండి విమర్శలు ఎక్కువైన నేపథ్యంలో సిట్ అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు. గడచిన వారం రోజుల్లో సిట్ అధికారులు 160 మందిని విచారించారు. ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నారు. వివేకా హత్య జరిగి 9 నెలలైనా హత్య కేసులో నిందితులెవరో ఇప్పటికీ తేలలేదు. విచారణలో భాగంగా సిట్ అధికారులు గతంలో ఆదినారాయణ రెడ్డిని హాజరు కావాలని కోరినా ఏదో ఒక కారణం చెప్పి విచారణకు హాజరు కాకపోవటంతో సిట్ సీఆర్పీసీ 150 కింద ఆదేశాలు జారీ చేసింది. 
 
ఆదినారాయణ రెడ్డి విచారణతో ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన వివేకా హత్య కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. సిట్ ఆదినారాయణను వివేకా పోటీ చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి వివేకా హత్య జరిగే వరకు జరిగిన కీలక పరిణామాల గురించి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివేకానంద రెడ్డి హత్య తరువాత కొంతమంది వైసీపీ నేతలపై, టీడీపీ నేతలపై ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: