దిశా అత్యాచారం, హత్య తర్వాత మద్యం నియంత్రించాలని సర్వత్రా చర్చ జరుగుతుంది. మద్యం నియంత్రించడంతో పాటు బెల్ట్ షాపులను ఎత్తివేయాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మద్యం నుంచి ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంపై కూడా అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో నవంబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. ఈ పాలసీలో 5వేల జనాభాకు ఇక మద్యం షాపును కేటాయించింది. దీనివల్ల మద్యం షాపులను సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మద్యం నుంచి భారీగా ఆదాయం కూడగట్టుకునేందుకు ప్రభుత్వం యోచించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాపంపిణీ వ్యవస్థలో సబ్సిడీ బియ్యం ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి అదనపు భారాన్ని మద్యం నుంచి భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీన్నిబట్టి మద్యంపై ప్రభుత్వం ఏ మేరకు ఆధారపడిందో అర్ధమౌతుంది. కానీ మద్యం వల్ల చాలా మంది ఆరోగ్యంతో పాటు అనర్థాలు కూడా జరుగుతున్నాయని పలువురు నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యంపై కీలక నిర్ణయం తీసుకున్నది. దీంట్లో భాగంగానే బెల్ట్ షాపులను పూర్తిగా నిషేదించడంతో పాటు మద్యం షాపులను ప్రతి ఏటా తగ్గించనున్నట్లు ప్రకటించింది. పైగా మద్యం పాలసీలో పలు మార్పులను తీసుకొచ్చింది. మద్య పాన నియంత్రణ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. కానీ తెలంగాణలో మద్యం ఏరులై పారుస్తున్నది. పైగా వైన్ షాపులు రాత్రి 11 గంటల వరకూ బార్ షాపులు రాత్రి 12గంటల వరకూ తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో అర్థరాత్రి వరకూ మందుబాబులు రోడ్ల పై సంచారం చేస్తున్నారు. దీనివల్ల దిశా లాంటి కేసులు చాలా జరుగుతున్నాయి. దీంతో గత వారం రోజుల నుంచి మద్యం నియంత్రణపై అన్ని వర్గాలు కూడా పెదవి విప్పుతున్నాయి.

 


 రాష్ట్రంలో నవంబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అమల్లోకి వచ్చిన నాటి నుంచి మద్యం విక్రయాలు గతేడాదితో పోల్చితే చాలా పెరిగినట్లు తెలిసింది. నవంబర్ 1వ తేదీ నుంచి 15 వ తేదీ వరకూ 20.76లక్షల కార్టన్ల మద్యం విక్రయించినట్లు అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం తెలుస్తున్నది. గతేడాది ఇదే నెలలో 12.90లక్షల కార్టన్ల మద్యం విక్రయించింది. దీన్నిబట్టి ఈ ఏడాది మద్యం విక్రయాలు పెరిగినట్లు తెలుస్తున్నది. బీర్ల అమ్మకాల్లోనూ ఇదే స్థాయిలో ఉన్నాయి. నవంబర్ 1 వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ 24.02లక్షల కార్టన్లను విక్రయించగా, గతేడాది 15.95లక్షల కార్టన్లను అమ్మినట్లు అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం తెలుస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం ఈ ఏడాది మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు ఫీజును కూడా భారీగా పెంచింది. గత పాలసీలో దరఖాస్తు ఫీజు ఒక లక్ష రూపాయలుండగా, ఈ పాలసీలో రూ.2లక్షలకు పెంచింది. దీని ద్వారా రూ.900కోట్ల ఆదాయం రాబట్టింది. దీన్నిబట్టి మద్యం అమ్మకాలను ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహిస్తుందో అర్థమౌతుంది. 

 

 రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా ఈ ఏడాదికి రూ.12,960 కోట్లు టార్గెట్ నిర్ధేశించింది. రెండేళ్ల క్రితం రూ. 8999 కోట్లు టార్గెట్ పెట్టుకోగా, రూ.11,000కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ప్రతి ఏటా మద్యం ఆదాయం టార్గెట్ ను ప్రభుత్వం పెంచుతున్నది. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో హైక్లాస్ వైన్ షాపు పేరిట 274 షాపులకు ప్రభుత్వం లైసెన్స్ లు జారీ చేసింది. ఈ షాపుల్లో ఖరీదైన వైన్ కూడా విక్రయించేందుకు అనుమతిచ్చింది. అంతేకాకుండా వైన్ షాపుల్లో రెండు లక్షలు అదనంగా చెల్లిస్తే పర్మిట్ రూమ్ లకు అనుమతి ఇచ్చింది. దీని వ‌ల్ల రాష్ట్రంలో ఎక్కడ చూసిన మద్యం ఏరులై పారుతున్నట్లు తెలుస్తుంది. దీంతో మహిళలు, పసిపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని మానసిన వైద్యులు వెల్లడిస్తున్నారు. 

 

 ఇదిలా ఉండగా మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రంలో టాప్ గా ఉందని తెలిసింది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రాన్ని కూడా వెనకకు నెట్టిందని లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 41.04శాతంమగవాళ్లు మద్యం సేవిస్తుండగా, 2.7శాతం మహిళలు మద్యం తీసుకుంటున్నారు. అదే నగర, పట్టణ ప్రాంతాల్లో 61.2శాతం మగవారు, 14.3శాతం ఆడవాళ్లు మద్యం సేవిస్తున్నట్లు అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం తెలుస్తున్నది. దీన్నిబట్టి మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో అర్థమౌతున్నది. 

 

 రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఈ స్థాయిలో పెరుగుతుంటే నేర ప్రవృతి కూడా అదే స్థాయిలో పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ మహిళలపై జరిగిన అత్యాచారాలు, హత్యలను పరిశీలిస్తే మద్యం తాగిన వారే దారుణాలను పాల్పడ్డారని బయటపడింది. ఇటీవల జరిగిన దిశా అత్యాచారం, ఆసిఫాబాద్ లో జరిగిన టేకు లక్ష్మి, వరంగల్ లో జరిగిన మానసపై కూడా మద్యం తాగి అత్యాచారాలకు పాల్పడ్డారు. దీన్నిబట్టి మద్యం నియంత్రణ జరిగితే తప్ప ఇలాంటి సంఘటనలను కొంతమేరకు తగ్గించే అవకాశాలు ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రభుత్వం కూడా విచ్చల విడిగా ఇచ్చిన అనుమతులను తగ్గించడంతో పాటు బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వీటిని తగ్గించకుండా ప్రభుత్వం మొండి వైఖరీ ప్రదర్శిస్తే భవిష్యత్ లో భారీ మూల్యం చెల్లించక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: