ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈరోజు వాడీవేడిగా జరిగాయి. వైసీపీ పార్టీ సభ్యుల మధ్య, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన 2014 ఎన్నికల్లో చంద్రబాబు రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి 88వేల కోట్ల రూపాయలను 24వేల కోట్ల రూపాయలకు తగ్గించారని ఆరోపణలు చేశారు. చంద్రబాబు హయాంలో రైతులకు బ్యాంకు రుణాలు కూడా అందలేదని బుగ్గన విమర్శలు చేశారు. 
 
చంద్రబాబు బుగ్గన ఆరోపణలపై స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వం 12,500 రూపాయలు ఇస్తామని చెప్పిందని 7,500 రూపాయలు మాత్రమే ఇచ్చిందని ఆరోపణలు చేశారు. వైసీపీని నమ్మి రైతులు మోసపోయారని చంద్రబాబు అన్నారు. వైసీపీ 12,500 రూపాయలు ఇచ్చి హామీని నిలబెట్టుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. "ముందుంది మొసళ్ల పండగ... లెక్కల గారడీ చేయలేరు" అని చంద్రబాబు అన్నారు. నాలుగు, ఐదు విడతల సొమ్ము రైతులకు చెల్లించాల్సిన భాద్యత వైసీపీ ప్రభుత్వంపై ఉందని చెప్పారు. 
 
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ కుక్కతోక వంకర అనే సామెత ఎప్పుడైనా విన్నారా అని అన్నారు. కుక్కతోక వంకరకు ఉదాహరణ ఎవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడే అని జగన్ అన్నారు. చంద్రబాబు స్పందిస్తూ ఎవరిది కుక్కతోక వంకరో కుక్కను నమ్ముకొని గోదావరి ఈదాలని నది మధ్యలోకి పోయినట్లు మిమ్మల్ని నమ్ముకొని ప్రజలు మోసపోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
 
గత ప్రభుత్వం కొనసాగించిన కార్యక్రమాలను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాల్సిన భాద్యత ఉందని చంద్రబాబు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ టీడీపీ హయాంలో 90 శాతం రైతులు అప్పులపాలయ్యారని అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతుల విషయంలో రెండడుగులు ముందుకు వేస్తే జగన్ నాలుగడుగులు ముందుకు వేశారని అన్నారు. రైతులకు మద్దతు ధర లేక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడింది నిజం కాదా...? అని రోజా ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: