తెలంగాణ ఆర్టీసీ ఆదాయం పెరిగింది.  టికెట్‌ ఛార్జీల పెంపుతో కాసులు వచ్చిపడుతున్నాయి. వారం రోజుల్లో 12 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇలానే కొనసాగితే త్వరలో ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల బాటపట్టే అవకాశం ఉంది. 

 

అసలే నష్టాల్లో ఉన్న సంస్థ ఆర్టీసీ. కార్మికుల సమ్మెతో ఇంకా కూరుకుపోయింది. వచ్చే ఆదాయాన్ని కోల్పోయింది. దీంతో ఆర్టీసీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. ఐతే.... 52 రోజుల తర్వాత కార్మికులు సమ్మె విరమించడం, కేసీఆర్‌ వరాల జల్లు కురిపించడంతో.. కొత్త ఆశలు చిగురించాయి. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు టికెట్‌ ఛార్జీలు పెంచింది యాజమాన్యం. ఛార్జీల పెంపు ప్రయాణీకులపై కొద్దిగా భారం పడినా... ఆర్టీసీకి మాత్రం లాభాలను తెచ్చిపెడుతోంది.

 

డిసెంబర్‌ 3 నుంచి కిలో మీటర్‌పై 20 పైసలు పెంచింది యాజమాన్యం. పల్లె వెలుగులో కనీసం ఛార్జీ 10 రూపాయలు, ఎక్స్ ప్రెస్‌లో కనీస ఛార్జి 15 రూపాయలుగా నిర్ణయించింది. గతంలో రోజుకు 36 లక్షల కిలోమీటర్లు తిరిగితే 11 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు 35 లక్షల కిలోమీటర్లే తిరిగినా 13 కోట్ల ఆదాయం వస్తున్నట్లు బస్‌ భవన్‌ అధికారులు చెబుతున్నారు. ప్రతి కిలోమీటర్‌కు గతంలో 28.70 పైసల ఆదాయం రాగ.. ఇప్పుడు 32.64 పైసల ఆదాయం పెరిగింది. ఈలెక్కన వారం రోజుల్లో సుమారు 12 కోట్ల అదనపు ఆదాయం లభించినట్లు అధికారులు చెబుతున్నారు. 

 

ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకు రావడానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇకపై ప్రయాణీకుడు చెయ్యెత్తిన చోట బస్సు ఆపాలని, అలాగే ప్రయాణికుడు అడిగిన చోట దింపాలని అన్ని డిపోలకు ఆదేశాలిచ్చారు. ప్రతీ బస్సులో 80 శాతం ప్రయాణికులు ఉండాలని సూచించారు. మహిళలకు రాత్రి 8లోపే డ్యూటీలు ముగించాలన్న కేసీఆర్ ఆదేశాలను అమలు చేస్తున్నారు. అన్ని రకాల బస్సుల్లో మహిళల డ్యూటీలను మార్చారు. ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం నిధులను విడుదల చేయడం, సమ్మెకాలానికి జీతాలు ఇవ్వడానికి అంగీకరించడంతో.. కార్మికులు కుషీగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: