ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి  సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థ ని ప్రభుత్వం లో విలీనం చేసి ఆర్టీసీ కార్మికులకు  ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను మొదలు పెట్టింది జగన్ సర్కార్. 

 

 

 అయితే తాజాగా ఆర్టీసీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ సంస్థ ను నిర్వహించడం వల్ల ప్రతి ఏటా ప్రభుత్వానికి 1200 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఈ నష్టాన్ని భర్తీ చేయాలంటే ఆర్టీసీ లో ఛార్జీల పెంపు తప్పనిసరి అని జగన్ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు కిలోమీటర్ కు  20 పైసలు పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కాగా  ఈ పెంచిన ఛార్జీలు రేపటి నుంచి అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రతిపక్ష పార్టీ గగ్గోలు పెడుతుంది. జగన్  సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని విమర్శలు చేస్తోంది. 

 

 

 

 ఈ నేపథ్యంలో రేపు టీడీపీ నిరసన చేపట్టేందుకు నిర్ణయించింది. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల ముందు నిరసన  కార్యక్రమాలు చేపట్టేందుకు... టిడిపి నిర్ణయించింది. సచివాలయం వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా టిడిపి నేతలు నిరసనకు దిగినున్నట్లు  తెలుస్తుంది. ఇదిలా ఉంటే అటు తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించిన అనంతరం ఆర్టీసీని ముందుకు నడిపించాలంటే ఛార్జీల పెంపు తప్పనిసరి అని చెప్పి కిలో మీటర్ కు 20 పైసల మేర చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెంచిన కొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ టికెట్  చార్జీలు పెంచడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: