పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్ ) రాజ్యసభ ఆమోదం పొందనుందా ? అన్నదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది . రాజ్యసభ లో అధికార బీజేపీ కి సరిపడా బలం లేకపోవడం, మద్దతుపై శివసేన , జేడీయూ లు దాగుడుమూతలు ఆడుతుండడం తో లోక్ సభ ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు , రాజ్యసభ ఆమోదం పొందుతుందా ? లేదా ?? అన్నదిప్పుడు హాట్ టాఫిక్ గా మారింది .  రాజ్యసభ లో మొత్తం 240  స్థానాలుండగా, ఈ బిల్లు ఆమోదం పొందాలంటే బిల్లుకు  121  మంది  సభ్యులు మద్దతుగా పలకాల్సిన అవసరం ఉంది .

 

అయితే రాజ్యసభ లో బీజేపీ కి కేవలం 83  మంది సభ్యుల బలం ఉండగా , ఇక తమ మిత్రపక్షాలతో కలిసి 108  మంది మద్దతు ఈ బిల్లుకు  లభించే అవకాశాలున్నాయి . అయితే చిన్న, చితక పార్టీల మద్దతును కూడగట్టి బిల్లును గట్టెక్కించేందుకు బీజేపీ నాయకత్వం తీవ్ర ప్రయత్నాలనే చేస్తోంది . తాము సూచించిన మేరకు మార్పులు చేయకపోతే బిల్లుకు మద్దతునిచ్చేది లేదని ఇప్పటికే శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు . ఇక జేడీయూ కూడా అదే వైఖరిని ప్రదర్శిస్తోంది . ఈ నేపధ్యం లో పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతునిచ్చేది ఎవరు ?, వ్యతిరేకించేది ఎవరన్న దానిపై స్పష్టత కొరవడింది .

 

బీజేపీ నాయకత్వ లెక్కల ప్రకారం 129 మంది సభ్యులు బిల్లుకు  మద్దతునిచ్చే అవకాశాలున్నాయని , బిల్లు సునాయాసంగా రాజ్యసభ లో కూడా ఆమోదం పొందుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు . కానీ వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉండడం , ఇప్పటి వరకూ ఇతర పార్టీలు చేసిన సూచనలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం తో , రేపు రాజ్యసభ లో ఏమి జరగనుందన్న దానిపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది .

మరింత సమాచారం తెలుసుకోండి: