టీడీపీ అధినేత చంద్రబాబు రోజురోజుకూ సహనం కోల్పోతున్నారు. ఒకప్పుడు ఉన్న ఓర్పు ఆయనలో లేకుండా పోయింది. రోజురోజుకూ అసహనం పెరిగిపోవడంతో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటికే పలుసార్లు బరస్ట్ అయిన బాబు....తాజా అసెంబ్లీ సమావేశాల్లో మరింత దారుణంగా దిగజారిపోయారు. తనకు మైక్ ఇవ్వలేదని చెప్పి స్పీకర్ పై ఇష్టానుసారం మాట్లాడేశారు. దీంతో స్పీకర్ కూడా చంద్రబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అటు వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

అసలు అసెంబ్లీలో ఏం జరిగందంటే... ఈ ఉదయం ఇంగ్లీష్ మీడియం విషయమై చర్చ జరుగుతున్న సందర్భంగా, ఈ అంశంపై గురువారం నాడు సుదీర్ఘంగా చర్చించుకుందామని ఆర్థికమంత్రి బుగ్గన సూచించారు. కాకపోతే ఈ చర్చ వ్యక్తిగత విమర్శల వైపు వెళ్లడంతో, చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారి తీశాయి. దీంతో తనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరగా, ఆంగ్ల మాధ్యమంపై రేపు చర్చిద్దామని, నేడు ప్రవేశపెట్టాల్సిన బిల్లులు చాలా ఉన్నాయని స్పీకర్ అన్నారు.

 

ఇక ఇక్కడే చంద్రబాబు తనకు మైక్ ఇవ్వడం లేదని చెప్పి... స్పీకర్ కు సభ్యత, సంస్కారం లేవని నోరు జారేశారు. స్పీకర్ వైఖరి మార్చుకోకుంటే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితిలు నెలకొన్నాయి. స్పీకర్‌కు కూడా మర్యాద ఇవ్వలేని స్థితికి వెళ్లిపోతున్నారని, ఇది బాధాకరమని తమ్మినేని హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకుడిగా గౌరవం ఉందని, దాన్ని కాపాడుకోవాలని వ్యాఖ్యానించారు.

 

ఇదే విషయంపై అంబటి రాంబాబు మాట్లాడుతూ...స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని, లేదంటే అది అసెంబ్లీకే అవమానకరమని అన్నారు. ఇక నీ అంతూ చూస్తా అంటూ మాట్లాడిన చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని జోగి రమేశ్ డిమాండ్ చేశారు. అలాగే చంద్రబాబు తమ జిల్లా నాయకుడుని అవమానించారని, ఆయనకు మానసికంగా జబ్బు చేసిందని, ట్రీట్మెంట్ చేయించాలని అప్పలరాజు మాట్లాడారు. 

 

అదేవిధంగా  40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు నుంచి తాను ఏమి నేర్చుకోవాలో అర్థం కావడం లేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.  మొత్తానికి స్పీకర్ పై పరుష పదజాలంతో మాట్లాడిన చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: