వంటింటిలో ముఖ్య‌మైన వాటిలో ఒక‌టైన ఉల్లి... చికెన్‌, మ‌ట‌న్ ధ‌ర‌ల‌ని మించి పెరుగుతుండ‌డంతో జ‌నాలు గ‌గ్గోలు పెడుతున్నారు.  దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల కొరత తీవ్రంగా ఉంది. ప్ర‌స్తుతం ఉల్లి ధ‌ర 200 రూపాయ‌ల‌కి చేరుకుంది. ఉల్లిపాయ ధరలు భారీగా పెరిగిపోవడంతో..  మహిళలు ఉల్లి లేకుండానే వంటలు చేస్తున్నారు.  కొందరు వ్యక్తులు ఉల్లిపాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రానున్న రోజులలో ఇంకెంత పెరుగుతుందో అని జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు. అయితే ఒక వైపు ఉల్లి ధ‌ర‌లు పెరుగుతుండ‌గా వీటిపై ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముంబయిలోని డొంగ్రీ ఏరియాలో డిసెంబర్‌ 5వ తేదీన ఇద్దరు వ్యక్తులు ఉల్లిపాయలను దొంగిలించారు. మ‌రోవైపు అదే న‌గ‌రంలో ఓ వ్య‌క్తి వీడియో చేశారు.
 
 
ఉల్లిపై జ‌నాలు సెటైరిక‌ల్‌గా వీడియోలు చేస్తుండ‌డం మ‌నం గ‌మనిస్తూనే ఉన్నాం. దొంగ‌త‌నం అంటూ పోస్టులు పెట్ట‌డం గ‌మ‌నిస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు ఉల్లిపాయలను దొంగిలించినట్లు ముంబైలోని ఓ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ముంబయిలోని డొంగ్రీలో 5వ తేదీన తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో దుకాణాల వద్ద ఈ చోరీ జ‌రిగింది. దీంతో బాధిత షాపు యజమానులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 21,160 విలువ చేసే ఉల్లిపాయలను స్వాధీనం చేసుకున్నారు!
 
 
మ‌రోవైపు, ప్ర‌ముఖ ఇండియ‌న్ టెలివిజ‌న్ న‌టి హీరా ఖాన్ త‌న తండ్రితో క‌లిసి ఉల్లిపాయ‌ల‌కి సంబంధించి ఓ వీడియో చేసింది.  ఈ వీడియో నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది. ఇంత‌కీ ఆ వీడియోలో ఏముందంటే... ``దేశంలో ఉల్లిపాయలు పెరుగుతున్న ధరల గురించి మీరు తెలుసుకోవాలి. రోజువారీ వంటగదిలో ఉప‌యోగించే ఉల్లి ధ‌ర ఇప్పుడు కిలో 200 రూపాయలకు చేరుకుంది. కాబట్టి, ఉల్లిపాయలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్న ఈ సమయంలో, మా తండ్రి ఉల్లిపాయతో నిండిన బకెట్‌ని దాచిపెడుతున్నారు` అని చెబుతూ వీడియో షేర్ చేసింది. ఇది స‌హ‌జంగానే వైర‌ల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: